లండన్: ఇస్లామిక్ రాజ్యం పేరిట సిరియా, ఇరాక్‌లలో అల్లకల్లోలం సృష్టిస్తున్న ‘జిహాది జాన్’ బందీలను భయభ్రాంతులను చేసేందుకు అప్పుడప్పుడు ‘షో’లే చిత్రంలోని గబ్బర్ సింగ్‌లాంటి పాత్ర కూడా ధరిస్తాడని అతని చెర నుంచి విముక్తుడైన స్పానిష్ పాత్రికేయుడు జావియర్ ఎస్పినోవా ద్వారా తెలుస్తోంది. ఆయన కథనం ప్రకారం ఓ రోజు జిహాది జాన్ చెరసాలలోని ఓ గదిలో పాత్రికేయుడు జావియర్‌ను మోకాళ్లపై కూర్చోబెట్టారు. ఇంతలో గుబురు గడ్డెంగల జిహాది జాన్, మధ్యయుగంలో ముస్లిం సైనికులు ఉపయోగించినటువంటి వెండి పిడిగల బారుడు కరవాలంతో గదిలోకి ప్రవేశించాడు. జావియర్ మెడపై తన కరవాలాన్ని పెట్టి సుతిమెత్తగా గీస్తూ ‘ఎలా వుందీ...చల్లగా ఉందికదూ! నీకలా అనిపించడం లేదా? ఇదే నీ మెడకాయనుకోస్తే నీకెంత బాధ కలుగుతుందో ఊహించగలవా,.ఊహు.. ఊహించనంత బాధ కలుగుతుంది’ అంటూ జిహాదీ జాన్ భయభ్రాంతులకు గురిచేశాడు. ఆ తర్వాత కరవాలాన్ని సహచరుడికిచ్చి చేతిలోకి పిస్టల్ తీసుకొని జావియర్ తలపైన గురిపెట్టి గబ్బర్ సింగ్‌లాగా ‘క్లిక్...క్లిక్...క్లిక్’ మూడుసార్లు పిస్టల్ ట్రిగ్గర్ నొక్కాడు. అందులో బుల్లెట్లు లేకపోవడంతో జావియర్‌కు ప్రాణాపాయం తప్పింది. ఆ తర్వాత స్పానిష్ ప్రభుత్వంతో చేసుకొన్న ఒప్పందం ప్రకారం జావియర్‌ను జిహాది జాన్ ప్రాణాలతో వదిలిపెట్టాడు. జాన్ చెరలో ఆరు నెలలపాటు తాను అనుభవించిన బాధను ‘ది సండే టైమ్స్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జావియర్ వెల్లడించారు. 2013లో టర్కీ సరిహద్దులోకి వెళుతున్న జావియర్‌ను జిహాది జాన్ అనుచరులు అరెస్టు చేసిన విషయం తెల్సిందే.
ఏడాదికాలంగా ఎంతోమంది బందీల కుత్తుకలను కత్తిరించి, వాటి తాలూకు వీడియోలను సామాజిక వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేస్తున్న నరరూప రాక్షసుడు జిహాది జాన్ అసలు పేరు అదికాదు. అతినికి బందీలు పెట్టిన నిక్‌నేమ్ అది. అసలు పేరు మొహమ్మద్ జాసిమ్ అబ్దుల్ కరీమ్. బ్రిటన్ జాతీయుడు. పుట్టింది కువైట్‌లో. ఆరవ ఏటనే అతని తల్లిదండ్రులు బ్రిటన్ వెళ్లి స్థిరపడడంతో అతను బ్రిటన్ జాతీయుడయ్యాడు. బీఎస్సీ ఆనర్స్ చదివిన జాన్ తన 21వ ఏట కువైట్‌కెళ్లి ఇక్కడ ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. మంచి పనివంతుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఏమైందో ఏమోగానీ అ తర్వాత సిరియా వెళ్లి ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదుల్లో కలిసిపోయాడు. అమెరికా జర్నలిస్ట్ స్టీవెన్ సాట్లాస్ గొంతుకోసి చంపిన వీడియో దృశ్యాన్ని 2014, సెప్టెంబర్ రెండవ తేదీన ‘యూట్యూబ్’లో అప్‌లోడ్ చేయడం ద్వారా జిహాది జాన్ గురించి ప్రపంచానికి తెల్సింది. అదే ఏడాది సెప్టెంబర్ 25వ తేదీన జిహాది జాన్‌ను ఎప్‌బీఐ గుర్తించింది. అతను స్కూల్లో చదివిన నాటి ఫొటోలను కూడా విడుదల చేసింది. ఇప్పుడు ఆ ఉగ్రవాదిని పట్టుకోవడం కోసం బ్రిటన్, అమెరికాలతోపాటు వాటి మిత్ర దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.
గబ్బర్ సింగ్ లా 'జిహాది జాన్'
Published Tue, Mar 17 2015 5:38 PM | Last Updated on Sat, Sep 2 2017 10:59 PM
Advertisement
Advertisement