
భారత్, అమెరికా ‘అణు’బంధం
పౌర అణు విద్యుత్‌పై భారత్, అమెరికా తొలి వాణిజ్య ఒప్పందం చేసుకున్నాయి. శుక్రవారం వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్‌లో భారత ప్రధాని మన్మోహన్ సింగ్‌తో సమావేశం అనంతరం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ విషయాన్ని వెల్లడించారు.
వాషింగ్టన్: పౌర అణు విద్యుత్‌పై భారత్, అమెరికా తొలి వాణిజ్య ఒప్పందం చేసుకున్నాయి. శుక్రవారం వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్‌లో భారత ప్రధాని మన్మోహన్ సింగ్‌తో సమావేశం అనంతరం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ విషయాన్ని వెల్లడించారు. పౌర అణు విద్యుత్‌లో ఇరు దేశాలు విశేష ప్రగతి సాధించాయని ఈ సందర్భంగా ఒబామా చెప్పారు. భారత్‌లో న్యూక్లియర్ ప్లాంట్ నెలకొల్పడానికి ఎన్‌పీసీఐఎల్, అమెరికా కంపెనీ వెస్టింగ్‌హౌస్ మధ్య ఒప్పందం కుదిరింది. ఐదేళ్ల క్రితం ఇరు దేశాల మధ్య అణు ఒప్పందం కుదిరిన తర్వాత తొలి వాణిజ్య ఒప్పందం ఇదే కావడం విశేషం. ఈ సందర్భంగా మాట్లాడిన ఒబామా.. భారత్ ప్రాంతీయ శక్తి కాదని, ప్రపంచ శక్తిగా మారిందని కొనియాడారు.
ఉగ్రవాదానికి ఇప్పటికీ ప్రధాన కేంద్రం పాకిస్థానే..
ఉగ్రవాదానికి పాకిస్థాన్ ఇప్పటికీ ప్రధాన కేంద్రంగానే కొనసాగుతోందని భారత ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. ఈ నేపథ్యంలో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో ఆదివారం జరగనున్న సమావేశంపై పెద్దగా అంచనాలు వ్యక్తం చేయలేదు. భారత ఉపఖండంలో ఉగ్రవాదం ఇంకా ఉధృతంగా ఉందన్నారు. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో న్యూయార్క్‌లో జరగనున్న సమావేశం కోసం ఎదురు చూస్తున్నానని చెప్పారు. జమ్మూలో గురువారం జరిగిన జంట ఉగ్రదాడుల అనంతరం స్వల్ప వ్యవధిలోనే ఈ సమావేశం జరగనుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. దాడుల నేపథ్యంలో సమావేశాన్ని రద్ధు చేసుకోవాలంటూ డిమాండ్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
అఫ్ఘానిస్థాన్, పాక్ సహా తమ ప్రాంతంలోని పరిస్థితిపై ఒబామా, తాను చర్చించామని తెలిపారు. ఉగ్రవాదానికి ప్రధాన కేంద్రంగా పాక్ ఉందన్న వాస్తవాన్ని తెలియజెప్పేందుకు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందిని వివరించామన్నారు. పెద్దగా అంచనాలు లేకున్నప్పటికీ పాక్ ప్రధానితో సమావేశం కోసం ఎదురు చూస్తున్నానని చెప్పారు. సిరియా, ఇరాన్ విషయంలో అమెరికా ఇంకో అవకాశం ఇవ్వడం పట్ల ఒబామాను ప్రధాని మెచ్చుకున్నారు. ఇలాంటి చర్యలకు భారత్ సంపూర్ణంగా మద్దతు పలుకుతుందన్నారు. పశ్చిమాసియా ప్రాంతంలో 60లక్షల భారతీయులు ఉండడమే దీనికి కారణంగా చెప్పారు. కాగా, అఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్‌లపై మన్మోహన్, తాను చర్చలు జరిపినట్లు ఒబామా కూడా వెల్లడించారు. ఉపఖండంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను శాంతియుతంగా తగ్గించేందుకు వీలుగా తాము అభిప్రాయాలను పంచుకున్నామన్నారు.
పాక్‌తో సంబంధాలు బలపడేందుకు మన్మోహన్ సింగ్ చేస్తున్న యత్నాలను ఒబామా ప్రశంసించారు. అంతకుముందు ఇరు నేతలు వైట్‌హౌస్‌లో పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. మూడేళ్ల విరామం తర్వాత రెండు దేశాల మధ్య జరిగిన ద్వైపాక్షిక భేటీ ఇదే. ప్రధాని వెంట విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్, జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్, విదేశాంగ శాఖ కార్యదర్శి సుజాతాసింగ్, అమెరికాలో భారత రాయబారి నిరుపమారావు కూడా ఉన్నారు. జమ్మూలో గురువారం ఉగ్రవాదుల జంట దాడుల నేపథ్యంలో.. పాక్ భూభాగం నుంచి పుట్టుకొస్తున్న ఉగ్రవాదంపై భారత్ ఆందోళనను మన్మోహన్ సింగ్ అమెరికాకు తెలియజేశారు. విదేశీ ఐటీ నిపుణులను నియంత్రిస్తూ ఇటీవల అమెరికా తీసుకొచ్చిన కఠిన వలస నిబంధనలు, వాణిజ్యం సహా పలు ఇతర అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి.