తాగి కోర్టుకు బయలుదేరిన మహిళా జడ్జి!
రోచెస్టర్ (న్యూయార్క్): ఆమె న్యాయాన్యాయాలను విచారించి.. తీర్పు ఇవ్వాల్సిన న్యాయమూర్తి. నేరస్తులను శిక్షించే ఉన్నతమైన అధికారం ఆమెది. కానీ ఆ మహిళా జడ్జి తాగి వాహనం నడుపుతూ ఏకంగా కోర్టుకు వెళ్లింది. దారిలో ట్రాఫిక్ పోలీసులు ఆమెను అడ్డుకొని అరెస్టు చేశారు. ఈ ఘటన అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగింది.
మహిళా న్యాయమూర్తి అయిన లెటిషియా అస్టాషియోను శనివారం ఉదయం న్యూయార్క్ స్టేట్ ట్రూపర్స్ అరెస్టు చేశారు. 2014లో జడ్జిగా నియమితురాలైన ఆమె తాగి వాహనం నడుపుతూ కోర్టుకు బయలుదేరింది. క్రిమినల్ కోర్టులో ఆమె వాదనలు వినాల్సి ఉంది. తాగి వాహనం నడిపిన కేసులో నిందితురాలిగా ఆమె వచ్చే నెల కోర్టుకు హాజరుకానున్నారని మాన్రో కౌంటీ జిల్లా అటార్నీ అయిన సాండ్ర డూర్లే తెలిపారు. అస్టాషియో అరెస్టు కావడంతో ఆమె స్థానంలో కొత్త న్యాయమూర్తిని నియమించినట్టు చెప్పారు. ఈ వ్యవహారంపై నిందితురాలైన అస్టాషియో కానీ, న్యూయార్క్ రాష్ట న్యాయస్థాన విభాగంకానీ ఇంతవరకు స్పందించలేదు.