టైరును రాసుకుంటూ.. 16కిమీ ప్రయాణించి
ఆడిలైడ్ :
ప్రపంచంలో అంతరిస్తున్న అరుదైన జీవుల జాబితాలో ఆస్ట్రేలియాకు చెందిన కొఆలా ఉంది. అయితే అనుకోకుండా ప్రమాదాన్ని కొరితెచ్చుకొని తృటిలో ప్రాణాపాయస్థితి నుంచి తప్పించుకుంది ఓ ఆడ కొఆలా. ఆడిలైడ్ శివారు ప్రాంతంలో పార్కింగ్ స్థలంలో ఆగిన ఓ కారు టైరు పైన ఉన్న ఆక్సల్‌ను పట్టుకుంది. ఇది గమనించకుండానే కారు యజమాని తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. దాదాపు 16 కిలో మీటర్లు వెళ్లిన తర్వాత బయట నుంచి శబ్ధం రావడంతో కారు ఆపి చూసే సరికి వెనక టైరు వద్ద కొఆలా ఉండటాన్ని గమనించాడు. వెంటనే రెస్క్యూ టీంకు సమాచారం అందించాడు. తీవ్రగాయాలతో అరుస్తున్న కోఆలాను టైర్ తీసి రెస్క్యూ సిబ్బంది బయటకు తీశారు.
కొఆలాను బయటకు తీసిన తర్వాత దాని వెంట్రుకల నుంచి కాలిన వాసనను గమనించానని ఫౌనా సంరక్షణ స్వచ్ఛంద సంస్థకు చెందిన జేన్ బ్రిస్టర్ తెలిపారు. ప్రయాణంలో ఉన్న కారు టైరుకు అతిదగ్గరగా ఉండటంతో రాపిడి జరిగి కొఆలా వెంట్రుకలు కొద్ది భాగం కాలిపోయాయి. అయితే సరైన సమయంలో డ్రైవర్ స్పందించి కారు ఆపడంతో పెనుప్రమాదం తప్పింది. స్పల్పగాయాల నుంచి కొఆలా కోలుకున్న తర్వాత దాన్ని తీసుకువెళ్లి అడవిలో వదిలి పెట్టారు. ప్రపంచ వ్యాప్తంగా కేవలం లక్ష కొఆలాలు మాత్రమే ఉన్నట్టు ఆస్ట్రేలియన్ కొఆలా ఫౌండేన్ తెలిపింది. తృటిలో ఈ అరుదైన జీవి ప్రాణాపాయం నుంచి బటయ పడటంతో జంతు ప్రేమికులు ఆనందం వ్యక్తం చేశారు.