
కాల్పులు జరిగిన క్లబ్ ఇదే
రియో డీ జనీరో: ఈశాన్య బ్రెజిల్‌లోని ఫోర్టలేజా నగరంలోని ఓ నైట్ క్లబ్‌లో ఆగంతకులు కాల్పులు జరపటంతో 14 మంది మృతిచెందారు. మరికొందరు గాయపడ్డారు. క్షతగాత్రుల పరిస్థితి తీవ్రంగా ఉందని ప్రభుత్వాధికారులు వెల్లడించారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది. శుక్రవారం అర్ధరాత్రి (స్థానిక కాలమానం ప్రకారం) 1.30 గంటలకు మూడు వాహనాల్లో వచ్చిన కొందరు సాయుధులు పార్టీలో ఉన్న వారిపై విచ్చలవిడిగా కాల్పులు జరిపారు.
గాయపడిన వారిలో ఓ పన్నెండేళ్ల బాలుడు కూడా ఉన్నాడు. ‘ఇది కిరాతకమైన చర్య. ఇంత క్రూరమైన ఘటన ఎప్పుడూ చూడలేదు’ అని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కొంతకాలంగా స్థానికంగా ఉండే రెండు డ్రగ్స్ అక్రమరవాణా బృందాల మధ్య ఘర్షణ నెలకొందని.. ఈ ఘటన కూడా ఈ రెండు వర్గాల మధ్య గొడవేనని స్థానిక మీడియా పేర్కొంది. వీరి ఘర్షణలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. జనవరి 7న ఫోర్టలేజా శివార్లలోనూ ఓ పార్టీలో జరిగిన ఘర్షణలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.