కొన్నాళ్ల క్రితం పాప్ గాయని మడొన్నాకు చెందిన విల్లాను కూడా ఈ శునకం కోసం కొన్నారు.
రాజభవంతిలాంటి భవనం.. సార్ వస్తున్నారహో..ఇంట్లో పనోడి అరుపు.. టైలు కట్టుకుని లైనులో నిల్చున్న పెద్ద పెద్ద ఉద్యోగులంతా అలర్ట్ అయ్యారు..ఇంతలో సార్ రానేవచ్చారు.. మందీమార్బలంతో.. అక్కడ ఉన్న సింహాసనంలాంటి కుర్చీమీద ఆసీనులయ్యారు.. అంతా సార్ ఏం చెబుతారా అని ఆసక్తిగా చూస్తున్నారు..అంతా నిశ్శబ్దం..ఇంతలో సార్ గంభీరంగా అన్నారు.. భౌ.. భౌ.. భౌభౌ.. వెంటనే విషయం అర్థమైనట్లుగా అందరూ హర్షధ్వానాలు చేశారు..
వినడానికి విచిత్రంగా ఉందా.. ఇదంతా నిజమేనండోయ్. అందుకే ఇక కనకపు సింహాసనమున శునకము కూర్చుండబెట్టి.. అన్న సుమతీ శతకాన్ని పక్కనపెట్టేయండి.. చీ కుక్క బతుకు అనీ చీప్‌గా చూడటం మానేయండి.. ఎందుకంటే.. ఈ వార్తంతా చదివాక ఆహా కుక్క బతుకు అని అనాల్సిందే.. జంతువుల లగ్జరీ లైఫ్‌ను చూసి కుళ్లుకోవాల్సిందే.. ఇది 2018లో ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన జంతువుల జాబితా మరి.. ఓసారి చూసేద్దామా..
1 గుంథర్–4
దేశం: జర్మనీ
ఆస్తి: 2,600 కోట్లు
ఈ జర్మన్ షెపర్డ్‌కు ఈ ఆస్తి తన తండ్రి గుంథర్–3 నుంచి వారసత్వంగా సంక్రమించింది.గుంథర్–3 యజమాని కర్లోటా లీబెన్‌స్టీన్ 1991లో చనిపోయింది. యావదాస్తి తన పెంపుడు కుక్క పేరిట రాసిపోయింది. ఆ సమయంలో ఆమె ఆస్తి 740 కోట్లే. అయితే.. గుంథర్ పేరిట ఏర్పాటు చేసిన ట్రస్టులోని ట్రస్టీలు ఆ సొమ్మును వివిధ వ్యాపారాల్లో పెట్టుబడులుగా పెట్టారు. అది పెరిగి ఈ స్థాయికి చేరింది.
2 గ్రంపీ క్యాట్
దేశం: అమెరికా
ఆస్తి: 700 కోట్లు
గుంథర్‌లాగా దీనికి వారసత్వంగా ఆస్తి రాలేదు. ఆ పిల్లి తన సొంత కాళ్లపై తాను నిలబడింది.కోటీశ్వరురాలైంది. దాని ముఖమే దానికి మనీ తెచ్చిపెట్టింది. ముఖం ముడుచుకున్నట్లు పెట్టే సీరియస్ లుక్ వల్ల బోలెడన్ని యాడ్‌లు వచ్చాయి. మోడలింగ్ చేసింది. సినిమాల్లోనూ నటించింది.
3 ఒలీవియా బెన్సన్
దేశం: బెన్సన్, అమెరికా
ఆస్తి: 680 కోట్లు
ప్రముఖ పాప్‌గాయని టేలర్ స్విఫ్ట్ పెంపుడు మార్జాలం. దాంతో ఆవిడలాగే దీనికీ క్రేజ్ వచ్చేసింది. తన యజమానితో కలిసి పలు యాడ్‌లలో నటించింది.ఇలా నాలుగు కాళ్లా సంపాదిస్తోంది.
4 శాడీ సన్నీ లారెన్ లేలా, ల్యూక్
దేశం: అమెరికా
ఆస్తి: 210 కోట్లు
టాక్‌షో క్వీన్ ఓప్రా విన్‌ఫ్రే బయటివాళ్లకే భారీ భారీ బహుమతులను ఇస్తూ ఉంటుంది. అలాంటిది తన ‘పంచ’ప్రాణాలకు ఇంకెంత ఖరీదైన బహుమతి ఇచ్చిందబ్బా అని చూస్తే.. ఏకంగా ఇదిగో ఇన్ని కోట్లు వాటికి రాసిచ్చేసి.. ట్రస్టును ఏర్పాటు చేసింది. ఈ మేరకు వీలునామా రాసేసింది.
5 గిగూ
దేశం: బ్రిటన్
ఆస్తి: 105 కోట్లు
నిజం.. చివరికి కోడిపెట్ట కూడా కోటీశ్వరురాలే. ఎందుకంటే.. దీన్ని పెంచుకుంది బ్రిటీషు సంపన్నుడు మైల్స్ బ్లాక్ వెల్. 2011లో తాను చనిపోయే ముందు వీలునామా రాస్తూ.. దీన్ని కూడా కోటీశ్వరురాలిని చేసి పోయాడు.
ఇలా చెప్పుకుంటూ పోతే.. చాలా జంతువులు మనుషులతో పోలిస్తే... మనీ విషయంలో ముందున్నాయి.మహారాజుల్లా బతికేస్తున్నాయి.
టాప్–10 జాబితాలో బార్ట్ అనే ఎలుగుబంటి కూడా ఉంది.బార్ట్ నటుడు. ఆస్తి దాదాపు 50 కోట్లు.. అలాగే.. పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్ పెంపుడు చింపాంజీ కూడా కాస్తో కూస్తో ఆస్తిపరురాలే. దాని ఆస్తి రూ.14 కోట్లు. ఈ మధ్య సొంతంగా కూడా సంపాదిస్తోందట. బొమ్మలు వేసి.. ఒక్కోటి లక్ష చొప్పున అమ్ముతోందట!! ఇప్పటికే వీటి ఆస్తుల వివరాలు చూసి.. మన మనసు అదో రకంగా అయిపోయి ఉంటుంది.. అందుకే ఈ ఆస్తిపాస్తుల చిట్టాకు ఫుల్‌స్టాప్ పెట్టేద్దామా మరి.. బై..
- సాక్షి సెంట్రల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment