
దీర్ఘాయుష్షుకు కారణం ఇదేనా!
కొందరు పిల్లలు పుట్టుకతోనే తెలివి గలవారుగా పుడుతారు. మరికొందరేమో పరిస్థితులు, జీవితంలో ఎదురైన అనుభవాలతో తెలివిగలవారుగా తయారవుతారు.
లండన్: కొందరు పిల్లలు పుట్టుకతోనే తెలివి గలవారుగా పుడుతారు. మరికొందరేమో పరిస్థితులు, జీవితంలో ఎదురైన అనుభవాలతో తెలివిగలవారుగా తయారవుతారు. తెలివిగల వారుగా పుట్టడానికి జన్యువులే కారణమని శాస్త్రవేత్తలు ఇది వరకే తెలిపారు. అయితే తెలివికి కారణమయ్యే ఆ జన్యువులే దీర్ఘాయుష్షును కూడా కలిగిస్తాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. తెలివితేటలు అధికంగా కలిగిన వారు ఇతరులతో పోలిస్తే ఎక్కువ కాలం జీవించగలరని, ఇందుకు మెదడులోని జన్యువులు కారణమని శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. అమెరికా, స్వీడన్, డెన్మార్క్‌లకు చెందిన కవలలు, కవలలు కాని వారి ఆయుఃప్రమాణాలపై లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ పరిశోధకులు అధ్యయనం చేశారు.
కవలలు అన్నిరకాల జన్యువులను పంచుకుంటుండగా, కవలలు కాని సోదరులు సగం మాత్రమే జన్యువుల్ని పంచుకుంటున్నారు. ఈ ఫలితాల ప్రకారం ఆయుఃప్రమాణం, తెలివితేటలు జన్యువులపై ఆధారపడి ఉంటాయని అధ్యయనం తెలిపింది. ఐక్యూ అధికంగా ఉండే పిల్లలు ఎక్కువ కాలం జీవిస్తారని ఈ పరిశోధనలో పాలుపంచుకున్న శాస్త్రవేత్త రోసాలిన్డ్ ఆర్డెన్ తెలిపారు. అంతేకాకుండా అలాంటివారు ఉద్యోగజీవితంలో కూడా మిగతావారితో పోలిస్తే ఉన్నత స్థానాల్లో ఉంటారని, ఎక్కువ కాలం జీవించే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల అకమిక్ నైపుణ్యాల్లో తేడాలకు కూడా జన్యువులు కూడా ఒక కారణమని ఈ అధ్యయనం తెలిపింది.