
లాటరీలు అంటే మనకు అంతగా పరిచయం లేదుగానీ.. విదేశాల్లో వాటికి ఉండే క్రేజే వేరు. తమదైన రోజున అనేకమంది అనామకులు లాటరీ అదృష్టం తగిలి రాత్రికిరాత్రే వేలకోట్లకు అధిపతులయ్యారు. చైనాలోని వాంగ్ చెంగ్ జౌ అనే వ్యక్తికి ఇలాంటి లాటరీ పిచ్చే ఉంది. లాటరీ టికెట్లు కొనడం.. తన టికెట్ ప్రైజ్‌మనీ గెలుచుకుందో లేదో చూసుకుంటూ ఉండేవాడు. 2004లో బహుమతి గెలుచుకున్న ఓ లాటరీ టికెట్‌ను చూసిన వాంగ్ దీని వెనుక ఏదో పెద్ద గణిత సూత్రం ఉందని భావించి.. దాన్ని ఎలాగైనా కనుక్కోవాలని అనుకున్నాడు.
ఇక అంతే ఇళ్లు, కుటుంబసభ్యులను వదిలేసి కొంత డబ్బు తీసుకుని పాడుబడ్డ బ్రిడ్జి కింద ఉన్న గుహకు చేరాడు. లాటరీ గుట్టును ఛేదించే పనిలో పడ్డాడు. లాటరీ గుట్టును రట్టు చేసి రాత్రికిరాత్రే కోటీశ్వరుడు అయిపోవడమే తన జీవిత లక్ష్యంగా మార్చుకుని పనిలో నిమగ్నమయ్యాడు. ఈ క్రమంలో ఓ చానల్ ఈ విషయాన్ని తెలుసుకుని కథనాన్ని ప్రసారం చేసింది. దీన్ని చూసిన వాంగ్ తల్లి అతన్ని ఇంటికి రావాలని కోరగా.. గుట్టు ఛేదించే వరకు ఇంటి గడప తొక్కనని శపథం చేశాడు.
ఎట్టకేలకు 10 ఏళ్లు కష్టపడి లాటరీల వెనుకున్న రహస్యాన్ని గుర్తించాడు. అయితే ఆ రహస్యాన్ని తెలపాల్సిందిగా మీడియా కోరగా.. రహస్యాన్ని బయటపెట్టలేనిని సున్నితంగా తిరస్కరించాడు. అయితే త్వరలో దీన్ని పుస్తక రూపంలో తెస్తానని అన్నాడు. ఒకసారి పుస్తకం విడుదలైతే తన వద్దకు వందల మిలియన్లు వచ్చి పడతాయని వాంగ్ తెగ సంబరపడిపోతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment