
వాషింగ్టన్ : ఓ గుర్తుతెలియని వ్యక్తి కారు నిండా ఆయుధాలతో ఏకంగా అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్‌కు బయలుదేరడం కలకలం రేపింది. అధ్యక్ష భవనం సమీపంలో మూత్రవిసర్జన చేసి అడ్డంగా బుక్కయ్యాడు. ఆపై అతడు చెప్పిన విషయాలు విని అధికారులు షాకయ్యారు. వైట్ హౌస్ అధికారుల తెలిపిన వివరాల ప్రకారం.. అమెరికా జాతీయ భద్రతా సలహాదారుతో ఓ వ్యక్తి కొన్ని విషయాలు చర్చించాలనుకున్నాడు. ఆదివారం తన కారులో ఏకే 47 సహా తొమ్మిది తుపాకులు, మూడు కత్తులు, మరికొంత ఆయుధసామాగ్రితో వైట్‌హౌస్ కు బయలుదేరాడు.
వైట్ హౌస్ సమీపానికి రాగానే బహిరంగ ప్రదేశంలో మూత్రవిసర్జన చేస్తూ ఆ వ్యక్తి విచిత్రంగా ప్రవర్తించాడు. అతడి కదలికలను గుర్తించిన పోలీసులు అనుమానిత వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. కారును తనిఖీ చేయగా అందులో ప్రమాదకర ఆయుధాలు ఉండటంతో షాకవ్వడం అధికారుల వంతైంది. తాను వైట్ హౌస్‌కు వెళ్లి రక్షణశాఖ కార్యదర్శి జేమ్స్ మాటిస్, జాతీయ భద్రతా సలహాదారు అడ్మైరల్ మైక్ రోజర్స్‌తో మాట్లాడేందుకు వైట్‌హౌస్‌కు వెళ్తున్నట్లు చెప్పాడు. మిస్సయిన పే చెక్స్‌ను ఎలా గుర్తించాలో.. తన మైండ్‌లోని చిప్‌ను బయటకు తీస్తే తెలుస్తుందంటూ విచిత్రమైన బదులిచ్చాడు.
అనుమానిత వ్యక్తి మానసిక స్థితి సరిగా ఉందో లేదో తెలుసుకునేందుకు దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆ వ్యక్తిని డీసీ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. ఆయుధాలు, తుపాకులు కలిగిఉన్నాడన్న కారణంగా ఆయుధాలచట్టం కింద కేసు నమోదు చేశారు. ఓ కేసులో నిందితుడిగా ఉన్న ఇదే వ్యక్తి 2009లో సిల్వర్ నిస్సాన్ కారులో ప్రయాణిస్తూ పోలీసుల చేతికి చిక్కినట్లు సమాచారం.