రిమోట్ చోరీకి అంత పెద్ద శిక్షా!
వాషింగ్టన్: ఎన్నో చోరీలు చేశాడు కానీ ఇలాంటి శిక్ష అతడు ఎప్పుడూ అనుభవించి ఉండడు. టీవీ రిమోట్ చోరీ చేసిన ఓ వ్యక్తికి స్థానిక మేజిస్ట్రేట్ ఏకంగా 22ఏళ్ల జైలుశిక్ష విధించారు. వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్నప్పటికీ.. ఈ ఘటన అమెరికాలోని చికాగో సిటీలో ఇటీవల చోటుచేసుకుంది. గతంలో అతడు చేసిన తప్పిదాలను లెక్కలోకి తీసుకుంటే అతడికి 30 ఏళ్ల వరకు శిక్ష వేయవచ్చు అంటూ చికాగో ట్రిబ్యునల్ లో సీనియర్ న్యాయవాది రాబర్ట్ బెర్లిన్ తన వాదన వినిపించారు. చివరికి 22 ఏళ్ల శిక్ష ఖరారు చేశారు.
ఎరిక్ బ్రామ్‌వెల్(35) చికాగోలో నివాసం ఉంటున్నాడు. అయితే గత కొన్నేళ్లుగా అతడు పలుమార్లు చోరీలకు పాల్పడి జైలుశిక్ష అనుభవించాడు. ఈ క్రమంలో రెండేళ్ల కిందట చికాగోలోని మెల్ రోస్ పార్క్ ఏరియాలో 100 బ్లాక్ ఆఫ్ క్రాస్ స్ట్రీట్లో ఓ అపార్ట్ మెంట్లో ప్రవేశించాడు. అపార్ట్ మెంట్ లోని ఫ్లాట్‌లో టీవీ రిమోట్‌ను చోరీ చేసిన ఎరిక్ ఎలాగోలాగ అక్కడినుంచి తప్పించుకున్నాడు. తరచుగా ఇలాంటి చోరీలకు పాల్పడే ఎరిక్‌ను పోలీసులు అనుమానించి ఇంట్లో వేలిముద్రలు, కొన్ని వివరాలు సేకరించారు. ఎరిక్ వేలిముద్రలు, డీఎన్‌ఏతో మ్యాచ్ చేసి చూసిన వారు అదుపులోకి విచారణ జరిపారు. తాను రిమోట్ చోరీచేసినట్లు అంగీకరించాడు. పలుమార్లు చోరీలకు పాల్పడిన ఎరిక్‌కు చికాగో కోర్టు 22 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. సగం శిక్షాకాలాన్ని పూర్తయిత తర్వాతే అతడికి పెరోల్ అవకాశం కల్పించింది.