వైన్ తాగి 107 ఏళ్ళు బతికాడు..!
ఇటీవల చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్ళిన ఓ 107 ఏళ్ళ వృద్ధుడి జీవన విధానం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అతడు కేవలం రెడ్ వైన్ మాత్రమే తాగి బతికాడన్న విషయం తెలిసి అంతా విస్మయం చెందారు. స్పెయిన్ గాల్సియాలోని విగోకి చెందిన యాంటోనియో డొకాంపో గార్సియా క్రితం వారం అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. బతికున్నంత కాలం తాను స్వయంగా ఇంట్లో తయారు చేసుకున్న రెడ్ వైన్ మాత్రమే తాగేవాడట.
డొకాంపో మధ్యాహ్న భోజనానికి బదులుగా రెండు బాటిల్స్... డిన్నర్ కు బదులుగా మరో రెండు బాటిల్స్ రెడ్ వైన్ తాగేవాడు. అంటే ఒక్కసారి అతడు తాగే మొత్తం వైన్ ఒకటిన్నర లీటరు వరకు ఉంటుందని అతడి కుమారుడు మిగ్వెల్ డొకాంపో తెలిపాడు. తామిద్దరూ కలిసి ఇంట్లోనే నెలకు రెండు వందల లీటర్ల రెడ్ వైన్ తయారు చేసేవాళ్ళమని, నీళ్లు కూడా తాగకుండా తన తండ్రి వైన్ మాత్రమే ఆహారంగా తీసుకునేవాడని చెప్తున్నాడు. 107 సంవత్సరాలపాటు తన తండ్రి ఎంతో ఆరోగ్యంగా బతికారని... స్పానిష్ అంతర్యుద్ధంలో ప్రాంకో కోసం పోరాటం తరువాత వైన్ ఉత్పత్తి కేంద్రం.. బొడేగాస్ డొకాంపో స్థాపించారని, అందుకోసం రబాదావియా టౌన్ లో స్వంత ద్రాక్షతోట ఏర్పాటు చేసుకున్నారని తెలిపాడు.
డొకాంపో కేవలం కెమికల్ ఫ్రీ ఆర్గానిక్ వైన్ ను మాత్రమే తాగేవాడు. అయితే అతడు ఉత్పత్తి చేసిన వైన్ లో ఎక్కువ భాగం అమ్మేయగా... మిగిలిన వైన్ తో పాటు, అతని ద్రాక్షతోటను ప్రస్తుతం అతడి మేనల్లుడు జెరోనిమో డొకాంపో నిర్వహిస్తున్నాడు. డొకాంపో సంవత్సరానికి 60,000 లీటర్ల వైన్ ను ఉత్సత్తి చేసి, అందులో 3 వేల లీటర్లను తన కోసం ఉంచుకొనేవాడు. అయితే తాను అన్నేళ్ళు ఆరోగ్యంగా బతకడానికి వైనే కారణమని ఎప్పుడూ చెప్తుండేవాడట.