ఫేస్‌మాస్క్‌ల గురించి మనకు ఏం తెలుసు? | Masks Are Mandatory In 50 Countries | Sakshi
Sakshi News home page

ఫేస్‌మాస్క్‌ల గురించి మనకు ఏం తెలుసు?

Published Sat, May 23 2020 3:40 PM | Last Updated on Sat, May 23 2020 4:00 PM

Masks Are Mandatory In 50 Countries - Sakshi

ప్రాణాంతక కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాల పరిశోధకులు వ్యాక్సిన్‌ అభివృద్ధి చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. వ్యాక్సిన్‌ తయారు చేసిన కొన్ని దేశాలు క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నాయి. అయితే అప్పటి వరకు మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు మాస్కులు ధరించడం, సామాజిక ఎడబాటు, వ్యక్తిగత పరిశ్రుభత పాటించడం మాత్రమే మనముందున్న మార్గాలు. కరోనా సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు పలు దేశాలు లాక్‌డౌన్‌ పూర్తిగా ఎత్తివేయగా.. మరికొన్ని నిబంధనలు సడలించి ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభించాయి. ఇందులో భాగంగా దాదాపు 50 దేశాలు మాస్కు ధరించడం తప్పనిసరి చేశాయి. లేనిపక్షంలో భారీ జరిమానాలు విధించేందుకు సన్నద్ధమయ్యాయి. కరోనా కాలంలో అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్న ఫేస్‌మాస్క్‌ల గురించి మనకు ఏయే విషయాలు తెలుసు?!

ఒక్కసారిగా పెరిగిన రేట్లు..
కరోనా సోకకుండా ఉండేందుకు దాదాపుగా ప్రతి ఒక్కరు మాస్కులు ధరిస్తున్నారు. వైరస్‌ లక్షణాలు ఉన్న వ్యక్తి తుమ్మినపుడు లేదా దగ్గినపుడు అతడి నోటి నుంచి వెలువడే నీటి తుంపరలు మనపై పడకుండా ఇది అడ్డుకుంటుంది. అంతేకాదు గాలిలోని అనేకానేక సూక్ష్మజీవులు మన శరీరంలోకి ప్రవేశించకుండా ఆపేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు విధిగా మాస్కు ధరిస్తున్నారు. అంటువ్యాధి ప్రబలుతున్న నేపథ్యంలో మాస్కు వినియోగం తప్పనిసరిగా మారడంతో ఒక్కో మాస్కు ధర దాదాపు 1.25 డాలర్లకు పెరిగింది. ఇక హానికారక క్రిములను 95 శాతం ఆపగల సామర్థ్యం ఉన్న ఎన్‌95 వంటి మాస్కుల దాదాపు 25 డాలర్ల మేర రేటు పెరిగింది. ఇలాంటి తరుణంలో ఫ్యాషన్‌ హౌజ్‌లతో పాటు బీఎండబ్ల్యూ వంటి ప్రఖ్యాత కార్ల కంపెనీలు సైతం తమ సిబ్బంది కోసం ప్రత్యేకంగా మాస్కులు తయారు చేసేందుకు ఉపక్రమించాయి.


డబ్ల్యూహెచ్‌ఓ ఏం చెబుతోంది?
ఓ వ్యక్తి ఆరోగ్యవంతుడు అయినప్పటికీ కోవిడ్‌-19 సోకిన వ్యక్తికి సేవలు అందిస్తున్నట్లయితే తప్పనిసరిగా మాస్కు ధరించాలి. అదే విధంగా తుమ్ములు, పొడిదగ్గుతో ఇబ్బంది పడుతున్న వ్యక్తులు శానిటైజర్‌ వాడటంతో పాటుగా మాస్కు వేసుకోవాలి. ప్రాణాంతక వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రతీ ఒక్కరు సాధారణ మాస్కు ధరించడం ద్వారా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.

ఇక యూకే ప్రభుత్వం... సామాజిక ఎడబాటు సాధ్యం కాని తరుణంలో(ఉదా: ప్రజా రవాణా) తప్పనిసరిగా మాస్కు ధరించాలని సూచించింది. సామాన్య పౌరులు సాధారణ వస్త్రంతో తయారు చేసిన మాస్కుతో ముఖాన్ని కవర్‌ చేసుకోవచ్చని.. అయితే హెల్త్‌ వర్కర్లు మాత్రం సర్జికల్‌ మాస్కు తప్పనిసరిగా ధరించాలని పేర్కొంది. అమెరికా సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ సైతం ఇదే తరహా సూచనలు చేసింది. 

ఏయే దేశాల్లో మాస్కులు తప్పనిసరి?
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 దేశాలు బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించడం తప్పనిసరిగా చేశాయి. వెనిజులా, వియత్నాం మార్చి 18న తొలుత నిబంధన విధించగా.. చెక్‌ రిపబ్లిక్‌ సైతం ఇదే బాటలో నడిచింది. అమెరికన్‌, లుఫ్తాన్సా, యునైటెడ్‌ తదితర ఎయిర్‌లైన్స్‌ కూడా విమానప్రయాణాల్లో మాస్కు ధరించాలని స్పష్టం చేశాయి. ఇంగ్లండ్‌, ఫ్రాన్స్‌ల మధ్య రైలు సర్వీసులు నడిపే యూరోస్టార్‌ కూడా కరోనా ప్రబలిన తొలినాళ్లలోనే మాస్కుల ఆవశ్యకతను అనుసరించి నిబంధన తీసుకువచ్చింది. కాగా కొన్ని దేశాల్లో మాస్కులు ధరించనట్లయితే భారీ జరిమానాలు విధిస్తున్న విషయం తెలిసిందే. ఫ్రాన్స్‌లో మాస్కులేకుండా ప్రజా రవాణాలో ప్రయాణం చేస్తే 145 డాలర్ల ఫైన్‌ చెల్లించాలి.

ఎక‍్కడెక్కడ తయారవుతున్నాయి?
మహమ్మారి కరోనాకు జన్మస్థానంగా భావిస్తున్న చైనా గతేడాది ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో మాస్కులు తయారు చేసిన దేశంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా వినియోగంలో ఉన్న సగం మాస్కులు చైనా తయారు చేసినవే. కాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది తొలి త్రైమాసికంలో డిస్పోజబుల్‌ మాస్కుల గ్లోబల్‌ మార్కెట్‌ విలువ 75 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. వచ్చే ఏడేళ్లలో ఇది 50 శాతం మేర పెరుగనున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో మాస్కులకు పెరిగిన డిమాండ్‌ దృష్ట్యా ప్రపంచ వ్యాప్తంగా పలువురు ఎంటర్‌ప్రెన్యూర్లు మాస్కుల తయారీకి ఆసక్తి చూపుతున్నారు. అయితే వారిలో చాలా మంది అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలను అందుకోలేకపోతున్నారు. ఈ నాణ్యతను దృష్టిలో పెట్టుకుని అమెరికా, నెదర్లాండ్స్‌, స్పెయిన్‌, టర్కీ వంటి దేశాలు కొన్ని సంస్థలు తయారు చేసిన మాస్కులను తిరస్కరిస్తున్నాయి.

ఎన్ని మాస్కులు అవసరం? ఎంత మేర ఉత్పత్తి?
మహమ్మారి నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా నెలకు దాదాపు 89 మిలియన్ల మాస్కులు అవసమవుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. అదే విధంగా 76 మిలియన్ల గ్లోవ్స్‌, 1.6 మిలియన్‌ గాగుల్స్‌, ఫేస్‌ విజర్స్‌ అవసరం పడుతాయని పేర్కొంది. 

కాగా కరోనా విజృంభించిన తొలినాళ్లలో వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు దాదాపు 300 మిలియన్‌ మాస్కులు అందుబాటులో ఉంచాలని అమెరికా అధికారులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో గతేడాది 550 మిలియన్‌ మాస్కులు తయారీ చేసిన స్థానిక ఫ్యాక్టరీ ఒకటి.. ఈ ఏడాది ఉత్పత్తిని గణనీయంగా పెంచి ఆ సంఖ్యను 2 బిలియన్లకు చేరుస్తామని వెల్లడించింది. 

డ్రాగన్‌ దేశం చైనా సైతం అన్ని రకాల మాస్కుల తయారీ సామర్థ్యాన్ని 10 మిలియన్ల నుంచి 115 మిలియన్లకు పెంచినట్లు ఫిబ్రవరిలో వెల్లడించింది. కాగా కొన్ని దేశాలు మాత్రం ఇతర దేశాల నుంచి మాస్కులు దిగుమతిపై నిషేధం విధించి.. ప్రత్యేక ఫ్యాబ్రిక్‌లతో అత్యాధునిక మాస్కులు రూపొందించే పనిలో నిమగ్నమయ్యాయి. 

మూడు రకాల మాస్కులు..
ప్రపంచవ్యాప్తంగా మూడు రకాల మాస్కులు ఉత్పత్తి అవుతున్నాయి. సర్జికల్‌, రిస్సిరేటర్‌, క్లాత్‌ ఫేస్‌ కవరింగ్‌ మాస్కులు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా సర్జరీ సమయంలో పేషెంట్లకు ఇన్‌ఫెక్షన్‌ సోకకుండా ఆపరేషన్‌ థియేటర్‌లో సర్జికల్‌ మాస్కులు ఉపయోగిస్తారు. గాలిని శుద్ధి చేసే రిస్సిరేటర్లను కూడా రోగుల కోసం ఉపయోగిస్తారు. ఇక కరోనా కాలంలో మాస్కుల వినియోగం తప్పనిసరి కావడంతో ముఖాన్ని కవర్‌ చేసుకునేందుకు ఇంట్లోనే క్లాత్‌ మాస్కులు తయారు చేసుకోవాల్సిందిగా సీడీసీలు సూచిస్తున్నాయి. ఫేస్‌మాస్కుతో పాటు కళ్ల నుంచి వైరస్‌ లోపలికి ప్రవేశించే వీల్లేకుండా గాగుల్స్‌ ధరించాలని సలహా ఇస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement