సెక్సీయెస్ట్ పోలీస్ దళానికి చెక్ పడింది!
మెక్సికో: మోకాళ్ల వరకు బూట్లు, అందమైన చలువ కళ్లద్దాలు, దేహానికి అతుక్కుపోయే యూనిఫామ్స్.. ఇది ఇప్పటివరకు మెక్సికన్ మహిళా పోలీసుల ప్రత్యేక దళం రూపరేఖలు. ప్రపంచంలోనే సెక్సీయెస్ట్ పోలీసు దళంగా ముద్రపడిన ఈ యూనిటుకు తాజాగా చెక్ పడింది. కొత్త పోలీసు బాస్ ఈ బృందాన్ని రద్దు చేస్టున్నట్టు ప్రకటించారు.
అత్యాధునిక ఆహార్యంతో ప్రత్యేకంగా రూపొందిన ఈ మహిళా పోలీసు దళం వీధుల్లో గస్తీ నిర్వహించేందుకు వినియోగించేవారు. పోలీసింగ్ మహిళా కోణాన్ని, పోలీసుల పట్ల మహిళలకు మరింత విశ్వాసం కల్పించడానికి ఈ దళాన్ని ఏర్పాటుచేశారు. పురుషులతో దీటుగా దేహదారుఢ్యం, ఆయుధాల ఉపయోగం, హెలికాప్టర్లలో ఆపరేషన్ నిర్వహణ వంటి అంశాల్లో ఈ దళానికి శిక్షణ కూడా ఇచ్చారు. మెక్సికన్ అధ్యక్షుడు ఎన్ రిక్యూ పెనా నీటో 2013 ఫిబ్రవరిలో ఈ ప్రత్యేక దళంతో ఫొటో దిగడం కూడా అప్పట్లో చాలా ఫేమస్ అయింది.
మెక్సికన్ సిటీ కొత్త పోలీసు బాస్ గా బాధ్యతలు చేపట్టిన రొనాల్డో హిడాల్గో ఎడీ మాత్రం ఈ దళాన్ని పూర్తిగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ దళం స్థానంలో ప్రామాణికమైన పోలీసు యూనిఫామ్ లో సేవలందించే సెవెన్ యూనిట్ దళాన్ని నియమిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ ప్రత్యేక బృందాన్ని రద్దుచేయడంపై మహిళా పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లెగ్గింగ్స్, హైహీల్స్ వంటి ఈ యూనిఫామ్ తమకు పెద్దగా సౌకర్యవంతంగా ఉండేది కాదని, ప్రజలు కూడా మా దగ్గరికి వచ్చి పెద్దగా మాట్లాడేవారు కాదని, ఎందకంటే ఈ ఫ్యాషనబుల్ ఆహార్యంలో తాము నిజమైన పోలీసులుగా అనిపించేవాళ్లం కాదని మహిళా పోలీసులు చెప్తున్నారు. మళ్లీ ప్రామాణికమైన పోలీసు దుస్తుల్లో యథాతథంగా పాత పోలీసింగ్ మరలడమే ఆనందంగా ఉందని తెలిపారు.