ట్రంప్ ప్రభుత్వాన్ని కడిగిపారేసిన మిషెల్
వాషింగ్టన్ : అమెరికా మాజీ తొలి మహిళ మిషెల్ ఒబామా, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై తీవ్రంగా మండిపడ్డారు. పాఠశాల భోజన పోషకాహార అవసరాలను తగ్గిస్తూ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నిర్ణయం తీసుకోవడంపై ఆమె సీరియస్ అయ్యారు. '' పాఠశాలలో మన పిల్లలకు మంచి భోజనం ఎందుకు వద్దనుకుంటున్నారు? మీకు ఏమైందసలు? ఎందుకంత పక్షపాత ధోరణిలో ఉంటున్నారు? అని ప్రశ్నలు సంధిస్తూ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ను ఒబామా శుక్రవారం రాత్రి పార్టనర్ షిప్ ఫర్ హెల్దియర్ అమెరికా నిర్వహించిన వార్షిక సమిట్ లో కడిగిపారేశారు.
బాల్యదశలో ఊబకాయంపై పోరాటం కోసం ప్రైవేట్, పబ్లిక్ రంగాలు కలిసి ఈ నాన్-ప్రాఫిట్ సంస్థను ఏర్పాటుచేశాయి. పాఠశాల భోజన పోషకాహార అవసరాలను కూడా ఎందుకు రాజకీయం చేస్తున్నారని మిషెల్ ఒబామా ఈ సమావేశంలో ప్రశ్నించారు. తృణధాన్యాలు, ఉప్పు, పాలు వంటి మూడు ముఖ్యమైన పదార్థాల్లో వచ్చే ఏడాదికి సంబంధించిన పాఠశాల ప్రమాణాలను సడలిస్తూ ట్రంప్ ప్రభుత్వంలోని అగ్రికల్చర్ సెక్రటరీ సోని పర్డ్యూ ఓ ప్రకటన చేశారు. ఈ ప్రకటన చేసిన వారం రోజులోనే మిషెల్ ఒబామా దీనిపై స్పందించారు.
అగ్రికల్చర్ సెక్రటరీ జారీచేసిన ప్రకటనలో తృణధాన్యాలు 100 శాతం స్టాండర్డ్స్ కలిగి ఉండాలనే నిబంధనలపై పాఠశాలకు విముక్తి ఇచ్చే విధంగా రాష్ట్రాలు సడలింపుల ఇవ్వచ్చని పేర్కొంది. దీంతో విద్యార్థులకు ఆఫర్ చేసే ఆహారంలో తక్కువ సోడియం ఉండాలనే కఠినతరమైన నిబంధనను పాఠశాల యాజమాన్యాలు పాటించకపోయినా చర్యలు ఉండవు. అయితే పాలసీలో మార్పులు పాఠశాలలో పిల్లలకు ఇచ్చే ఆహార విషయంలో నాణ్యత కోల్పోయే అవకాశముందని మిషెల్ ఆందోళన వ్యక్తంచేశారు. పాఠశాలలో ఆరోగ్యకరమైన భోజన ప్రాముఖ్యతపై ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఓ సారి ఆలోచించాలని మిషెల్ పేర్కొన్నారు. '' దీనిపై నేను నా పోరాటాన్ని కొనసాగిస్తా. ఈ సమస్యలపై నా అంకితభావం నిజమైనది'' అని తెలిపారు.