న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా విలయ తాండవం చేస్తున్న కరోనా వైరస్‌ను వీలైనంత వేగంగా కట్టడి చేయలేకపోతే రాబోయే రోజుల్లో మరణాల సంఖ్య లక్షల్లో ఉండే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియా గ్యుటెరాస్ హెచ్చరించారు. కరోనాను కార్చిచ్చుతో పోల్చారు. కార్చిచ్చులా వ్యాపిస్తున్న ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేయకుండా నిర్లక్ష్యం వహిస్తే లక్షల్లో ప్రాణాలు కోల్పోతారని దేశాలను హెచ్చరించారు.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే కరోనా కారణంగా 10వేల మరణాలు సంభవించగా ఈ వైరస్‌తో ఆరోగ్య పరిస్థితులు రోజురోజుకు మరింత క్షీణిస్తున్నాయని తెలిపారు. దీని నుంచి బయటపడడానికి పరస్పరం సహకారం అవసరమని అభిప్రాయపడ్డారు. ఇలాంటి సమయంలో ప్రపంచ దేశాలన్నీ కూడా ఆయా దేశాల్లో పరిస్థితలను చక్కబెట్టుకుంటూ ఇతర దేశాలతో ఉమ్మడి కార్యాచరణ రూపొందించి ముందుకు సాగాల్సిన ఆవశ్యకత ఉందని సూచించారు. చదవండి: ఏప్రిల్ 19న యుగాంతం; ఏంటి కథ?
ఆంటోనియో గ్యుటెరాస్ చేసిన వ్యాఖ్యలు:
►ప్రతి దేశం వ్యూహాత్మక చర్యలు చేపడుతూనే, కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేని దేశాలను కూడా ఆదుకోవాలి.
►కరోనాపై పోరులో జీ-20 దేశాలు ముందుండాలి. ఆర్థికంగా బలమైన దేశాలు స్వీయ పరిరక్షణతో సరిపెట్టుకోకుండా ఆఫ్రికా లాంటి పేద దేశాలపైనా, అభివృద్ధి చెందుతున్న ఇతర దేశాలపైనా దృష్టి సారించాలి.
►దేశాలు తమ మధ్య ఉన్న వాణిజ్య విభేదాలను పక్కనబెట్టి సరికొత్త సప్లై చైన్ వ్యవస్థలను పునరుద్ధరించాలి.
►త్వరలోనే ఈ వైరస్ ప్రతి ఒక్క దేశాన్ని తాకుతుంది. జీ20 దేశాలు ఇతర దేశాలకు సాయం చేయకపోతే దారుణ ఫలితాలు వస్తాయి.
►అల్పాదాయ, చిన్న, మధ్య తరహా వ్యాపారులను ఆదుకోవాలి. సామాజిక ఉద్యోగ భద్రత, జీతాలు ఇవ్వడం, బీమా సౌకర్యాలు వంటి వాటితో చేయూతనివ్వాలి.
►ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న దేశాలను వరల్డ్ బ్యాంకు, ఐఎంఎఫ్ వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ఆదుకోవాలి.
►ప్రపంచవ్యాప్తంగా పతనమవుతున్న ఆర్థిక వ్యవస్థలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
►స్వదేశీ వస్తు రక్షణ విధానం పాటిస్తున్న దేశాలు ఈ తరుణంలో కాస్త వెసులుబాటు నిర్ణయాలు తీసుకోవాలి.
►కోవిడ్-19పై ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలను అన్ని దేశాలు పాటించాలి.
Comments
Please login to add a commentAdd a comment