
లాహోర్: రెండేళ్ల క్రితం అదృశ్యమైన పాకిస్థాన్ సంచలన జర్నలిస్టు జీనత్ షాజాదీ ఎట్టకేలకు విడుదలయ్యారు. గురువారం పాక్ సరిహద్దుల్లో కొందరి బలుచిస్తాన్ యువకులు, గిరిజనుల సాయంతో అసాంఘిక శక్తుల చెర నుంచి ఆమెను విడిపించారు. ఈవిషయాన్ని సీఐఈడీ ప్రెసిడెంట్ జస్టీస్ జావేద్ ఇక్భాల్ దృవీకరించారు.
నయీ ఖబర్ అనే దినపత్రికలో స్థానిక రిపోర్టర్‌గా పనిచేస్తున్న జీనత్ (26) గూఢచార్యం ఆరోపణలపై అరెస్టయిన భారతీయ ఖైదీ హమీద్ అన్సారీ కేసును భుజానికెత్తుకొంది. ఈ క్రమంలో హమీద్ కోసం ఆయన తల్లి ఫౌజియా అన్సారీ తరఫున సుప్రీంకోర్టులోని మానవహక్కుల విభాగంలో జీనత్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత 2015 ఆగస్టు 19న ఆటోరిక్షాలో ఆఫీస్ కెళ్తున్న ఆమెను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు.
వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన ఐటీ ఇంజినీర్ హమీద్ అన్సారీకి ఫేస్‌బుక్‌లో పరిచయమైన పాకిస్థాన్‌లో ఓ యువతి ప్రేమించుకొన్నారు. ఆమెను కలుసుకోవడానికి వీసా లభించకపోవడంతో 2012 నవంబర్ 4న అక్రమంగా కాబూల్ చేరుకొన్నాడు. ఆన్‌లైన్ ఫ్రెండ్స్ కోహత్ అనే పట్టణంలోని ఓ హోటల్‌లో వసతి ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో 2012 నవంబర్ 14న హమీద్‌ను పోలీసులు అరెస్ట్ చేసి భద్రతా సిబ్బందికి అప్పగించారు. అతని తల్లికి సాయంగా నిలిచిన జీనత్ అదృశ్యం అప్పట్లో సంచలనం రేపింది. జీనత్ షాజాదీని లాహోర్‌లోని తన కుటుంబ సభ్యులతో కలపడం ఆనందంగా ఉందని బీనా సర్వర్ అనే సామాజిక కార్యకర్త పేర్కొన్నారు. ఇక అక్కను వెతికి వెతికి విసిగిపోయి.. మానసిక వ్యధకు గురైన ఆమె తమ్ముడు సద్దాం ఆత్మహత్య చేసుకొన్నాడు. ఇప్పటికీ హమీద్ పాక్ జైళ్లోనే ఉన్నారు. అతనికోసం పాక్ మానవహక్కుల నేత రెహ్మాన్ పోరాడుతున్నారు.