తప్పుడు ధ్రువీకరణ పత్రంతో పాకిస్తాన్‌లో ప్రవేశించాడనే కారణంతో పెషావర్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న 31 ఏళ్ల భారతీయ ఖైదీపై స్థానిక ఖైదీలు గత కొద్ది నెలల్లో మూడు సార్లు దాడికి పాల్పడినట్లు అతని తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆన్‌లైన్‌లో పరిచయమైన అమ్మాయిని కలిసేందుకు ముంబైకి చెందిన హమిద్ నెహాల్ అన్సారీ 2012లో తప్పుడు ధ్రువీకరణ పత్రంతో భారత్ నుంచి అఫ్ఘానిస్తాన్ ద్వారా పాక్‌లో ప్రవేశించాడు.
హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న తీవ్ర నేరస్తులున్న సెల్‌లో తన క్లయింట్‌ను ఉంచడం వల్ల వారు అతన్ని తీవ్రంగా కొడుతున్నారని అన్సారీ తరుపు న్యాయవాది పెషావర్ హైకోర్టుకు విన్నవించారు. జైలు హెడ్ వార్డర్ కూడా ఏ కారణం లేకుండానే అతన్ని ప్రతిరోజూ హింసిస్తున్నట్లు న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. భారతీయ ఖైదీపై దాడి వాస్తవమేనని, ఇదేమీ అంత పెద్ద సంఘటన కాదని, జైళ్లలో ఇటువంటి ఘటనలు సహజమేనని జైలు సూపరింటెండెంట్ అన్నట్లు డాన్ పత్రిక వెల్లడించింది.