పాక్‌ మీదుగా వెళ్లను | Modi will not use Pakistan airspace on way to Bishkek | Sakshi
Sakshi News home page

పాక్‌ మీదుగా వెళ్లను

Published Thu, Jun 13 2019 3:36 AM | Last Updated on Thu, Jun 13 2019 8:28 AM

Modi will not use Pakistan airspace on way to Bishkek - Sakshi

న్యూఢిల్లీ/బీజింగ్‌: కిర్గిజిస్తాన్‌లోని బిష్కెక్‌లో ఈ నెల 13–14 తేదీల్లో జరిగే షాంఘై సహకార సదస్సు (ఎస్‌సీవో)కు పాకిస్తాన్‌ గగనతలం మీదుగా వెళ్లరాదని ప్రధాని మోదీ నిర్ణయించుకున్నారు. తమ గగనతలం మీదుగా మోదీ విమానం వెళ్లేందుకు పాక్‌ అంగీకరించినప్పటికీ కేంద్రప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇరాన్, ఒమన్, ఇతర మధ్య ఆసియా దేశాల మీదుగా మోదీ విమానం కిర్గిజిస్తాన్‌ రాజధాని బిష్కెక్‌కు చేరుకుంటుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్‌‡ తెలిపారు. ఈ ప్రయాణానికి సంబంధించి రెండు రూట్లను భారత ప్రభుత్వం ఖరారుచేసిందన్నారు.

కాగా, భారత ప్రధాని మోదీ విమానంలో ఎస్‌సీవో సదస్సుకు తమ గగనతలం మీదుగా వెళ్లేందుకు ప్రత్యేకంగా అనుమతిస్తామని పాక్‌ విమానయానశాఖ మంత్రి సర్వార్‌ఖాన్‌ చెప్పారు. మోదీ ప్రయాణించే ఎయిరిండియా బోయింగ్‌ 747–400 విమానం ఢిల్లీ నుంచి బిష్కెక్‌కు వెళ్లి తిరిగివచ్చేందుకు వీలుగా 72 గంటలపాటు పాక్‌ గగనతలంలో రాకపోకల్ని అనుమతిస్తామని పేర్కొన్నారు. ఎస్‌సీవోలో చైనా, భారత్, పాక్, కిర్గిజిస్తాన్‌ సహా 8 దేశాలు సభ్యులుగా ఉన్నాయి.

మరోవైపు షాంఘై సహకార సదస్సుకు హాజరయ్యేందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ బయలుదేరినట్లు ఆ దేశ ప్రభుత్వ మీడియా తెలిపింది. ఈ పర్యటనలో భాగంగా జిన్‌పింగ్‌ ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమవుతారని వెల్లడించింది. ఎస్‌సీవో సదస్సు సందర్భంగా జిన్‌పింగ్‌తో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో ప్రధాని మోదీ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చైనాతో పాటు భారత్‌పై కూడా వాణిజ్య యుద్ధం మొదలుపెట్టిన నేపథ్యంలో అమెరికాను కలసికట్టుగా ఎదుర్కోవడంపై జిన్‌పింగ్, మోదీ చర్చించే అవకాశముందని ప్రభుత్వవర్గాలు చెప్పాయి.

ఎస్‌సీవోతో పటిష్ట సంబంధాలు: మోదీ
బిష్కెక్‌లో జరిగే షాంఘై సహకార సదస్సు(ఎస్‌సీవో)లో అంతర్జాతీయ భద్రత, ఆర్థిక సహకారమే ప్రధాన అజెండాగా ఉంటాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. తన బిష్కెక్‌ పర్యటన ద్వారా ఎస్‌సీవో దేశాలతో భారత్‌ సంబంధాలు మరింత బలపడతాయని ధీమా వ్యక్తం చేశారు.

భారత రాయబారిగా వీడాంగ్‌
భారత్‌తో సత్సంబంధాలను పెంపొందించుకునే దిశగా చైనా కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్‌ దౌత్యవేత్త సున్‌ వీడాంగ్‌ భారత్‌లో తమ కొత్త రాయబారిగా నియమించింది. విదేశాంగ మంత్రి జైశంకర్‌ 2009–13 మధ్యకాలంలో చైనాలో భారత రాయబారిగా పనిచేసిన కాలంలో వీడాంగ్‌తో ఆయనకు మంచి అనుబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే చైనా విదేశాంగశాఖ పాలసీ–ప్రణాళికా విభాగంలో డైరెక్టర్‌ జనరల్‌గా పనిచేస్తున్న వీడాంగ్‌ను భారత్‌లో తమ రాయబారిగా నియమించింది. భారత్‌లో చైనా రాయబారిగా ఉన్న లో జుహుయీనిని విదేశాంగశాఖ సహాయమంత్రిగా నియమించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement