ఫొటోల కోసం 'కోతి' చేష్టలు!
ఎవరైనా పెద్దవాళ్లు ఫొటోలు తీయించుకుంటుంటే పిల్లలు మధ్యలో దూరి తామూ ఆ ఫొటోలో ఉండాలని అనుకుంటారు కదూ. దీన్నే 'ఫొటోబాంబ్' అంటారు. కానీ మనుషులే కాదు, జంతువులకు కూడా ఇలాంటి ఫొటో సరదా ఉంటుందన్న సంగతి మీకు తెలుసా? మడగాస్కర్‌లోని రెడ్ ఐలండ్‌లో అడవుల అందాలను ఫొటో తీసుకోవాలని వెళ్లిన ఓ వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్‌కు సరిగ్గా ఇలాంటి అనుభవమే ఎదురైంది. స్టెఫాన్ క్రైస్బెర్గ్స్ (39) అనే ఈ బెల్జియం ఫొటోగ్రాఫర్ మడగాస్కర్ వెళ్లి అక్కడ అడవులను ఫొటో తీస్తుండగా.. ఉన్నట్టుండి కెమెరా ముందుకు ఓ కోతి వచ్చింది. అడవులు, చెట్లను ఏం ఫొటో తీస్తావు గానీ ముందు నాకు తియ్యి అన్నట్లుగా పళ్లు ఇకిలిస్తూ తలకిందులుగా వేలాడుతూ మాంచి పోజు ఇచ్చింది. అనుకోకుండా ఆ ఫొటో క్లిక్ అయిపోయింది.
అయితే.. కెమెరా గురించి దానికి ఏం తెలుసో ఏమో గానీ, ఫొటోగ్రాఫర్‌ను, ఫొటో ఫ్లాష్‌ను చూసి బెదిరిపోవడానికి బదులు అప్పటి నుంచి అది రకరకాల పోజులు పెట్టడం మొదలుపెట్టింది. ఇక చేసేదేముంది అనుకుంటూ.. దాన్ని ఫొటోలు తీయసాగాడు. తోకతో వేలాడుతుండటంతో పాటు చేతులను రకరకాలుగా పెట్టి ఇది పోజులిచ్చింది. చివరగా ఫొటోగ్రాఫర్‌కు సెల్యూట్ చేస్తున్నట్లు కూడా చెయ్యి పెట్టిందీ మర్కటరాజం. ఇప్పటివరకు ఇలాంటి కోతిని తాను ఎప్పుడూ చూడలేదని, అది అచ్చం ''నన్ను చూసి ఓ ఫొటో తీసుకో'' అన్నట్లుగానే నిలబడిందని చెప్పాడు. ఫొటోలు అన్నీ తీసుకోవడం అయిపోయాక అది వెళ్లిపోయందని తెలిపాడు.
అశ్శరభ శరభ.. నేనే వస్తాదు!
నా ఫొటోలు తీశావుగా.. ఇదిగో ఓ సెల్యూట్!
నాలా ఇలా ఎవరైనా చెట్టుమీద కూర్చోగలరా?
ఇక ఇది ఫైనల్ పోజు.. ఈ ఫొటో తీస్తే నేను వెళ్లిపోతా