న్యూయార్క్ : ప్రపంచంలో హాలీవుడ్ మార్కెట్ ఎంత పెద్దగా ఉంటుందో పెద్దగా వేరే చెప్పనవసరం లేదు. 2019 ఏడాదిలో యూఎస్ ఫిల్మ్ ఇండస్ర్టీ 40 బిలియన్ అమెరికన్ డాలర్ల ఆదాయాన్ని కొల్లగొట్టి రికార్డులు సృష్టించింది. కానీ అమెరికాలోని పబ్లిక్ లైబ్రరీతో పోటీ పడాలంటే మాత్రం హాలీవుడ్ ఇంకా చాలా కృషి చేయాల్సి ఉందని గాలప్ పోల్ సంస్థ పేర్కొంది. అదేంటి హాలీవుడ్ మార్కెట్‌కు, పబ్లిక్ లైబ్రరీకి సంబంధం ఏంటనే డౌట్ వస్తుందా.. అక్కడే అసలు విషయం ఉంది. 2019 ఏడాదిలో అమెరికాలో సినిమాల కంటే లైబ్రరీలకు వెళ్లిన వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు గాలప్ పోల్ తన సర్వేలో వెల్లడించింది.
గాలప్ పోల్ సంస్థ ఏడాదిలో అమెరికన్లు తమకు నచ్చిన ప్రాంతాలను ఎన్నిసార్లు చుట్టివస్తున్నారనే దానిపై సర్వే జరిపింది. సంస్థ ప్రతినిధి జస్టిన్ మెక్‌కార్తీ వివరాల ప్రకారం.. అమెరికాలో పబ్లిక్ లైబ్రరీని అమెరికన్లు ఏడాదికి సగటున 10.5 సార్లు సందర్శిస్తున్నారని పేర్కొన్నారు. కాగా లైవ్ మ్యూజిక్, ఈవెంట్స్, చారిత్రాత్మక ప్రదేశాలను ఏడాదికి 4 సార్లు సందర్శిస్తున్నారని, మ్యూజియం, జూదం ఆడే కేంద్రాలను ఏడాదికి 2.5 సార్లు వెళ్లివస్తున్నట్లు అధ్యయనంలో తేలింది.
ఇక చివరిగా అమెరికాలో పార్క్‌లను ఏడాదికి 1.5 సార్లు, జూలను 0.9 సార్లు సందర్శిస్తున్నట్లు తేలింది. కాగా ఈ సర్వేలో మరికొన్ని ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. పబ్లిక్ లైబ్రరీలను సందర్శిస్తున్న వారిలో పురుషల సంఖ్య కంటే మహిళల సంఖ్య రెండు రెట్లు ఎక్కువగా ఉండడం విశేషం. దీంతో పాటు లైబ్రరీకి వచ్చే వారిలో ఎగువ తరగతితో పోలిస్తే దిగువ తరగతి నుంచి వచ్చేవారే ఎక్కువగా ఉన్నట్లు సర్వేలో బహిర్గతమైంది.
Comments
Please login to add a commentAdd a comment