పన్ను చెల్లింపుల్లో కూడా ట్రంప్ కంపే!
న్యూయార్క్
అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ల తరఫున పోటీచేస్తున్న డోనాల్డ్ ట్రంప్ తాను అధికారంలోకి వస్తే ధనవంతులు అధిక పన్నులు చెల్లించాల్సి వస్తోందని, అధిక పన్నులు చెల్లించేందుకు తాను వ్యక్తిగతంగా ఎల్లప్పుడు సిద్ధమేనని పదే పదే చెప్పారు. అదే నోటితో అతి తక్కువ పన్నును చెల్లించేందుకు ఎంతదాకైనా పోరాడుతానంటూ 'ఐ కెన్ ఫైట్ లైక్ ఏ హెల్' అని సెప్టెంబర్‌లో జరిగిన ఓ విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు. పరస్పర భిన్నమైన ఈ రెండు వ్యాఖ్యలను చూస్తే ట్రంప్ ద్వంద్వప్రమాణాలు తేటతెల్లమవుతాయి. వాస్తవంగా ఆయన కంపెనీలు పన్నులు ఎగ్గొడుతున్నాయా, పన్ను వివాదాల్లో చిక్కకున్నాయా, పన్నులు ఎగవేసినందుకు జరిమానాలు చెల్లించాయా? అన్న అంశంపై 'యూఎస్‌ఏ టుడే' పత్రిక లోతుగా అధ్యయనం చేయగా దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడయ్యాయి.
డొనాల్డ్ ట్రంప్‌కు సంబంధించిన కంపెనీలపై వందకుపైగా పన్ను ఎగవేత కేసులు నమోదయ్యాయి. డజన్లకొద్దీ వారెంట్లు ఉన్నాయి. కొన్ని కేసుల్లో కోర్టు ఆదేశాల మేరకు ఆయన కంపెనీలు దాదాపు మూడు లక్షల డాలర్ల బకాయిలను చెల్లించాయి. ఇంకా అనేక కేసులు కోర్టు విచారణలో ఉన్నాయి. పన్ను చెల్లింపుల్లో ఆయన కంపెనీలేవీ పారదర్శకతను పాటించడం లేదు. ఆస్తులను, ఆదాయాలను అతి తక్కువ చూపించడం ఆయన కంపెనీలకు అలవాటు. వెయ్యి కోట్ల డాలర్ల ఆస్తిని వందకోట్ల డాలర్లుగా చూపించిన సందర్భాలు అనేకం. చట్టాల నిబంధనల మేరకు ఆదాయాన్నిబట్టి పన్ను చెల్లించాలంటూ సంబంధిత ప్రభుత్వం జారీచేసే ఉత్తర్వులను ఆయన కంపెనీలు ఎప్పుడు ఖాతరు చేయవు. తదుపరి చర్యలకు ఉపక్రమించినప్పుడు కోర్టులకు వెళ్లి పోరాటం చేస్తాయి. ఓడిపోయినప్పుడు మాత్రమే బకాయిలు చెల్లిస్తాయి.
అధ్యక్ష ఎన్నికల సందర్భంగా డోనాల్డ్ ట్రంప్ సమర్పించిన ఆస్తుల డిక్లరేషన్‌లో కూడా తన ఆస్తుల విలువను అతి తక్కువ చేసి చూపించారు. ఎన్నికల ప్రచారం కోసం ఆయన తిరుగుతున్న సొంత జెట్ బోయింగ్ విమానానికి దాదాపు పదివేల డాలర్ల పన్ను బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఆయన దేశధ్యక్ష పదవికి అభ్యర్థిగా రంగంలోకి దిగిన 2015, జూన్ నెల నుంచే ఇప్పటి వరకు ఆయనకు చెందిన ఐదు కంపెనీలకు 13వేల డాలర్ల వారంట్లను 'న్యూయార్క్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ టాక్సెస్ అండ్ ఫైనాన్స్' జారీచేసింది. న్యూయార్క్‌లోని బ్రియార్‌క్లిఫ్, ఫ్లోరిడాలోని జూపిటర్‌లో ఉన్న లగ్జరీ గోల్ప్ కోర్టుల వాస్తవ విలువను తక్కువగా చూపిస్తూ ట్రంప్, ట్యాక్స్ అఫీసర్స్‌పై కోర్టుకెక్కారు.
న్యూయార్క్‌తోపాటు నెవడా, ఫ్లోరిడా, న్యూజెర్సీ కోర్టుల్లో కూడా ట్రంప్ కంపెనీలపై పన్ను ఎగవేత కేసులున్నాయి. ఆయన కంపెనీలు గత 27 ఏళ్ల కాలంలో కేసుల కారణంగా మూడు లక్షల డాలర్ల బకాయిలను ప్రభుత్వానికి చెల్లించాల్సి వచ్చింది. 1990 నుంచి 2011 నాటికి న్యూయార్క్ సిటీ ట్యాక్స్ కమిషన్ ట్రంప్ కంపెనీలపై 55 కేసులు దాఖలు చేసింది. 2006 నుంచి 2007 మధ్య ట్రంప్ మార్ట్‌గేజ్ కంపెనీ కూడా 4,800 డాలర్ల పన్ను చెల్లించాల్సి ఉందని డాక్యుమెంట్లు తెలియజేస్తున్నాయి. ట్రంప్ కంపెనీలపై దేశవ్యాప్తంగా ఉన్న కోర్టుకేసులను, ఆస్తుల డాక్యుమెంట్లను, ఇతర డాక్యుమెంట్లను పరిశీలించడం ద్వారా 'యూఎస్‌ఏ టుడే' పత్రిక ఈ వివరాలను వెల్లడించింది.