న్యూయార్క్ : జీవితంలో అన్ని విధాలా నష్టపోయిన తర్వాతే తనతో పాటు బిడ్డ ప్రాణాలు కూడా పణంగా పెట్టాల్సి వచ్చిందని అమెరికాలో ఆశ్రయం కోరుతున్న ఓ సిక్కు మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. కూతురికి బంగారు భవిష్యత్తు ఇవ్వాలని భావిస్తే తమకు శాశ్వతంగా దూరమైందని విలపించారు. మెక్సికో సరిహద్దు గుండా అమెరికాలో ప్రవేశిస్తున్న శరణార్థుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత్‌కు చెందిన ఓ సిక్కు మహిళ కూడా న్యూయార్క్‌లో ఉన్న తన భర్తను కలుసుకునేందుకు ఈ మార్గాన్నే ఎంచుకున్నారు. కూతురితో కలిసి అమెరికాకు బయల్దేరిన ఆమె అందరూ శరణార్థుల లాగే స్మగ్లర్ల చేతికి చిక్కారు. శరణార్థుల అవసరాన్ని ఆసరాగా చేసుకున్న స్మగ్లర్లు.. వారి నుంచి కొంతమొత్తం వసూలు చేసి ల్యూక్‌విల్లే ప్రాంతంలోని అరిజోనా ఎడారి సమీపంలో వదిలి వెళ్లారు.
ఈ క్రమంలో ఆరేళ్ల కూతురు గుర్‌ప్రీత్ కౌర్ దాహాన్ని తీర్చేందుకు.. చిన్నారిని తెలిసిన వాళ్ల వద్ద వదిలి ఆమె తల్లి నీటి కోసం వెదుక్కొంటూ వెళ్లారు. ప్రస్తుతం అక్కడ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండటం, పైగా ఎడారి ప్రాంతం కావడంతో కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత వడదెబ్బ తగిలి స్పృహ తప్పిపోయారు. అదృష్టవశాత్తు అమెరికా సరిహద్దు బలగాలు అక్కడికి చేరుకోవడంతో గుర్‌ప్రీత్ తల్లితో పాటు ఆమెతో ఉన్న మరో మహిళకు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం తన కూతురు ఎడారిలో వేరే చోట ఉందని చెప్పడంతో ఆమె కోసం గాలింపు మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఓ చోట నిర్జీవంగా పడి ఉన్న గుర్‌ప్రీత్‌ను చూసి ఆమె తల్లి హతాశయురాలైంది. వారం రోజుల క్రితం జరిగిన ఈ హృదయ విదారక ఘటన అమెరికాలోని సిక్కు కమ్యూనిటీలో తీవ్ర చర్చనీయాంశమైంది.
ఈ నేపథ్యంలో గుర్‌ప్రీత్ తల్లిదండ్రుల తరపున అమెరికా సిక్కు కూటమి ఉమ్మడి ప్రకటనను విడుదల చేసింది. ‘ మా కూతురికి భద్రతతో కూడిన బంగారు భవిష్యత్తు అందించాలని భావించాం. అమెరికాలో ఆశ్రయం పొందాలని భావించాం. జాతి, మత, ప్రాంత, వర్ణ భేదాలకు అతీతంగా ప్రతీ తల్లిదండ్రులు తమ సంతానం కోసమే అహర్నిశలు శ్రమిస్తారని మేము భావిస్తాం. జీవితంలో పాతాళానికి పడిపోయిన తర్వాతే బిడ్డ ప్రాణాలను కూడా పణంగా పెట్టాల్సి వస్తుంది. మేము తీసుకున్న ఈ కఠిన నిర్ణయం మా చిన్నారిని మాకు దూరం చేసింది’ అని వారు ప్రకటనలో పేర్కొన్నారు.
కూతురు పుట్టిన ఆర్నెళ్లకే...
పంజాబ్‌కు చెందిన గుర్‌ప్రీత్ తండ్రి 2013లో అమెరికాకు వెళ్లాడు. అమెరికాలో ఆశ్రయం కోరుతూ అతడు చేసిన దరఖాస్తు న్యూయార్క్ ఇమ్మిగ్రేషన్ కోర్టులో ఇంకా పెండింగ్‌లోనే ఉంది. గుర్‌ప్రీత్ పుట్టిన ఆర్నెళ్ల తర్వాత అమెరికాకు వెళ్లిన అతడు మళ్లీ కూతురిని నేరుగా చూడలేదు. కాగా ప్రస్తుతం అరిజోనా ఫెసిలిటీ సెంటర్‌లో ఉన్న గుర్‌ప్రీత్ తల్లిని బస్సు మార్గం ద్వారా న్యూయార్క్ తరలించేందుకు అధికారులు నిర్ణయించారు. కోర్టు ముందు ఆమె హాజరు కావాల్సి ఉంది. అక్కడే గుర్‌ప్రీత్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా ఆఫ్రికా, ఆసియా దేశాల నుంచి అమెరికాలో ఆశ్రయం కోరుతూ అరిజోనా గుండా ప్రయాణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో ఏడాదిలో ఇప్పటి వరకు అక్కడ 58 మంది మృత్యువాత పడ్డారని పైమా కౌంటీ ఆఫీసుకు చెందిన ఓ వైద్యాధికారి తెలిపారు. గతేడాదిలో వీరి సంఖ్య 127గా ఉందని పేర్కొన్నారు. ఇక అక్రమంగా తమ దేశంలో ప్రవేశించాలని చూస్తున్న వారు.. కోరి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని సరిహద్దు అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాగా అమెరికాలో ఉన్న లక్షలాది మంది అక్రమ వలసదారులను త్వరలోనే వెళ్లగొడతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ‘అక్రమమార్గాల్లో వచ్చిన వారిని వెళ్లగొట్టేందుకు ఉద్దేశించిన ప్రక్రియను వచ్చే వారం ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ(ఐసీఈ) ప్రారంభించనుంది. ఎంత వేగంగా వచ్చారో అంతే వేగంతో వాళ్లు వెళ్లిపోతారు’ అని ట్వీట్‌చేశారు. ఈ నేపథ్యంలో సాయం నిలిపి వేస్తామంటూ మెక్సికోను భయపెట్టి మరీ అమెరికా ఒప్పందానికి దిగేలా చేసింది. దాని ప్రకారం వలసదారులను నిలువరించేందుకు అమెరికాతో సరిహద్దుల్లో మెక్సికో అదనంగా 6వేల మంది గార్డులను నియమించింది.
చదవండి : అరిజోనా ఎడారిలో భారతీయ చిన్నారి మృతి
Comments
Please login to add a commentAdd a comment