అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(ఫైల్ ఫొటో)
వాషింగ్టన్: ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభించిన నేపథ్యంలో మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) బారిన పడి చనిపోయే అమెరికన్ల సంఖ్య ఎక్కువగానే ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు. లాక్‌డౌన్ నిబంధనలు ఎత్తివేసిన క్రమంలో కరోనా మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రాణాంతక కరోనా వైరస్ ధాటికి అగ్రరాజ్యంలో ఇప్పటికే 70 వేల మందికి పైగా మృత్యువాత పడగా.. లక్షలాది మందికి వైరస్ సోకింది. ఈ క్రమంలో కరోనా సంక్షోభం వల్ల అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు అమెరికా ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించడంతో పాటుగా.. కొన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేసిన విషయం తెలిసిందే. (ఈ ఏడాది చివరికల్లా టీకా!)
ఈ నేపథ్యంలో ట్రంప్ తొలిసారిగా మంగళవారం అరిజోనాలో ఉన్న ఫోనిక్స్‌లో గల హనీవెల్ ఫ్యాక్టరీని సందర్శించారు. మాస్కులు తయారీ చేస్తున్న సిబ్బందిని అభినందించారు. ఈ సందర్భంగా సామాజిక ఎడబాటు నిబంధనలను సడలించి... ఆర్థిక కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడం వల్ల కరోనా మృతులు పెరిగే అవకాశం ఉంది కదా విలేకరులు ప్రశ్నించగా.. ‘అవును ఆ అవకాశమైతే ఉంది. మనం అపార్టుమెంటులోనో, ఇంట్లోనో లాక్ చేసుకుని ఉండలేం కదా. కరోనా ప్రభావం ఉంటుందని తెలుసు. అయితే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం కూడా ముఖ్యమే’అని ట్రంప్ సమాధానమిచ్చారు. కాగా మాస్కుల తయారీ కర్మాగారాన్ని సందర్శించిన సమయంలోనూ ట్రంప్ మాస్కు ధరించకపోవడం గమనార్హం. (ట్రంప్ అవునంటే కాదనిలే!)
కరోనా పోరులో ముందుండే వైద్య సిబ్బంది కోసం తయారు చేసిన మాస్కులను విలేకరుల ముందు ప్రదర్శించిన ట్రంప్.. తాను పెట్టుకునేందుకు మాస్కు ఇవ్వబోతున్న ఫ్యాక్టరీ సిబ్బందిని వారించారు. దీంతో ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యతాయుత స్థానంలో ఉండి కనీస జాగ్రత్తలు పాటించకుండా ట్రంప్ ప్రజలకు ఎటువంటి సందేశం ఇస్తున్నారని ప్రతిపక్షం మండిపడుతోంది. కోవిడ్-19 లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా నిరసనలకు దిగుతున్న వారికి ట్రంప్ మద్దతు ఇవ్వడాన్ని కూడా పలువురు తప్పుబడుతున్నారు. మహమ్మారి అంతా ఓ బూటకం అని నినదిస్తూ కరోనా వ్యాప్తికి పరోక్షంగా కారణమవుతున్న వారిని ట్రంప్ ఎంకరేజ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక అమెరికా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ట్రంప్ పర్యటన ప్రాధాన్యం సంతరించకుంది. ఇదిలా ఉండగా.. శ్వేతసౌధ వర్గాలు మాత్రం మాస్కు విషయంలో ట్రంప్ వ్యవహారశైలిని వెనకేసుకొచ్చాయి. ట్రంప్ సహా ఇతర ఉన్నత అధికారులు తరచుగా కోవిడ్-19 పరీక్షలు చేయించుకుంటున్న కారణంగా అంతగా భయపడాల్సిన పనేం లేదని చెప్పుకొచ్చాయి. (లక్ష మరణాలు.. చాలా భయంకరం: ట్రంప్)
Comments
Please login to add a commentAdd a comment