డెన్మార్క్‌లో మరో భూగోళం
సరదాగానైనా సరే... ఎప్పుడైనా మీకు భూమి మొత్తాన్ని కాలి నడకన చుట్టేయాలి అనిపించిందా? అబ్బో... 25 వేల మైళ్ల చుట్టుకొలత ఉన్న భూగోళాన్ని చుట్టేయాలంటే ఏళ్లు పూళ్లయిపోవూ అంటున్నారా? నిజమే.
సరదాగానైనా సరే... ఎప్పుడైనా మీకు భూమి మొత్తాన్ని కాలి నడకన చుట్టేయాలి అనిపించిందా? అబ్బో... 25 వేల మైళ్ల చుట్టుకొలత ఉన్న భూగోళాన్ని చుట్టేయాలంటే ఏళ్లు పూళ్లయిపోవూ అంటున్నారా? నిజమే. ఈ పనిచేసేందుకు దాదాపు 11 ఏళ్లు కావాలని.. అది కూడా నీటిపై నడిచే విద్య వచ్చి ఉంటేనే సాధ్యమని ఒక అంచనా. ఈ చికాకులన్నీ ఎందుకులెండి అంటే మాత్రం మీరు డెన్మార్క్‌కు వెళితే చాలు! ఎందుకంటే అక్కడే ఉంది వర్డెన్ కోర్‌టెట్. మన భాషలో చెప్పాలంటే వరల్డ్ మ్యాప్! ఫొటోల్లో చూపినట్లు పచ్చటి పరిసరాల మధ్య ఓ పార్క్‌లోని సరస్సుపై ఉంటుంది ఇది. ఆ.. ఇందులో గొప్పేముంది.. దుబాయిలో ఏకంగా భారీసైజు దీవులతోనే ప్రపంచపటాన్ని కట్టేశారు కదా. అనుకోవద్దు. డెన్మార్క్ వరల్డ్‌మ్యాప్‌ను కట్టింది ఒకే ఒక్క వ్యక్తి.. స్రెన్ పోల్సెన్. అది కూడా పాతికేళ్లపాటు శ్రమకోర్చి మరీ పూర్తి చేశాడు.
రాళ్లు, మట్టిని మాత్రమే వాడుకుంటూ చేతి పనిముట్ల ద్వారా కట్టడం వల్ల ఇంత సమయం పట్టిందట. నదులు, పర్వత ప్రాంతాలు, చివరకు ఎడారులను గుర్తించి మరీ స్కేల్‌కు తగ్గట్టుగా దీన్ని కట్టడం విశేషం. మానవజాతి ఆఫ్రికాలో పుట్టి ప్రపంచమంతా విస్తరించింది అనేందుకు సూచనగా.. ఈ వరల్డ్‌మ్యాప్‌లోకి ఆఫ్రికా ఉన్న చోట నుంచి ప్రవేశించాల్సి ఉంటుంది. మొత్తమ్మీద ఈ మ్యాప్ 300 అడుగుల పొడవు, 150 వెడల్పు ఉంటుంది. భూమ్మీది 69 మైళ్ల పొడవును ఈ మ్యాప్‌పై పది అంగుళాలుగా గుర్తించి కట్టారన్నమాట. ప్రతి దేశాన్ని దాని జాతీయ పతాకంతో గుర్తించారు. అమెరికా ఉన్న చోటులో మాత్రం పసుపు పచ్చటి ఇటుకలు ఉంచారుట. భూమధ్య రేఖను గుర్తించేందుకు ఎరుపు రంగు స్తంభాలు ఉన్నాయి. వర్డెన్ కోర్‌టెట్‌పై చిన్న చిన్న పార్టీలు కూడా చేసుకోవచ్చు. అంతేకాకుండా దీనిపైనే ఓ మినీ గోల్ఫ్ కోర్స్ కూడా ఉంది. వర్డెన్ కోర్‌టెట్‌ను చూసేందుకు ఏటా దాదాపు 35 వేల మంది యాత్రీకులు వస్తూంటారని అంచనా.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్