విమానాశ్రయాలు, షాపింగ్ సెంటర్లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఎంత రద్దీగా ఉన్నా.. మనుషులు తమ దుస్తుల్లో దాచుకుని తెచ్చే పేలుడు పదార్థాలను, తుపాకులను అత్యంత వేగంగా గుర్తించే ఓ రాడార్ స్కానర్‌ను పరిశోధకులు అభివృద్ధిపర్చారు.
సరికొత్త రాడార్ స్కానర్‌ను తయారుచేసిన శాస్త్రవేత్తలు
లండన్: విమానాశ్రయాలు, షాపింగ్ సెంటర్లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఎంత రద్దీగా ఉన్నా.. మనుషులు తమ దుస్తుల్లో దాచుకుని తెచ్చే పేలుడు పదార్థాలను, తుపాకులను అత్యంత వేగంగా గుర్తించే ఓ రాడార్ స్కానర్‌ను పరిశోధకులు అభివృద్ధిపర్చారు. మాంచెస్టర్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తయారుచేసిన ఈ సరికొత్త స్కానర్ బహిరంగ ప్రదేశాల్లో భద్రతకు చాలా కీలకం కానుంది. రాడార్ తరంగాలు, క్లిష్టమైన కంప్యూటర్ ప్రోగ్రామ్‌ల సాయంతో ఈ స్కానర్ ఆటోమేటిక్‌గా 25 మీటర్ల దూరంలో గల జనసమూహంలోని వ్యక్తులను అణువణువూ పరిశీలిస్తుంది. బాంబులు, తుపాకుల వంటి ఆయుధాలను దాచుకుని గుంపులుగా దాటుతున్నా కూడా ఇది వేగంగా పసిగట్టి కొన్ని సెకన్ల వ్యవధిలోనే హెచ్చరిస్తుంది. దీనితో ప్రజల వ్యక్తిగత గోప్యతకు, ఆరోగ్యానికి ఎలాంటి ముప్పూ ఉండదని పరిశోధకులు చెప్పారు. తాము ‘మిర్టిల్’, ‘మిర్లిన్’ అనే రెండు 20, 25 మీటర్ల పరిధి స్కానర్లను అభివృద్ధిపర్చామని, వీటి ఉత్పత్తి వచ్చే ఏడాది ప్రారంభిస్తామన్నారు.