
లండన్: పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్‌బీ)ను రూ.13,000 కోట్ల మేర మోసం చేసిన కేసులో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ(48)కి మరోసారి చుక్కెదురైంది. తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ నీరవ్ దాఖలు చేసిన పిటిషన్‌ను బ్రిటన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మెజిస్ట్రేట్స్ కోర్టు బుధవారం మూడోసారి తిరస్కరించింది. ప్రస్తుత పరిస్థితుల్లో నీరవ్‌కు బెయిల్ మంజూరుచేస్తే ఆయన తిరిగి విచారణకు హాజరుకాకపోవచ్చని చీఫ్ మెజిస్ట్రే్టట్ ఎమ్మా అర్బత్‌నాట్ అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా నీరవ్ న్యాయవాది క్లేర్ మాంట్‌గొమెరి వాదిస్తూ..‘లండన్ శివార్లలో ఉన్న వాండ్స్‌వర్త్ జైలులో పరిస్థితులు మనుషులు జీవించేలా లేవు. కోర్టు బెయిల్ కోసం ఎలాంటి షరతులు పెట్టినా అంగీకరిస్తాం. అలాగే పూచికత్తుగా 20 లక్షల పౌండ్లు సమర్పిస్తాం. నీరవ్ 24 గంటలు నిఘానీడలో ఇంటిలోనే ఉండేలా కోర్టు ఆదేశించినా మాకు అంగీకారమే’ అని చెప్పారు. ఇది సాధారణ కేసు కాదనీ, నీరవ్ గతంలోనే సాక్షులను ప్రభావితం చేయడంతో పాటు బెదిరించేందుకు ప్రయత్నించారని భారత న్యాయవాది నిక్ హెర్న్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం తదుపరి విచారణను కోర్టు మే 30కి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment