
శిశువులకు అన్నం వద్దు
వాషింగ్టన్: ఏడాదిలోపు వయసున్న శిశువులకు అన్నం పెట్టడం మంచిది కాదని అమెరికా శాస్త్రజ్ఞులంటున్నారు. అన్నం తినే పిల్లల మూత్రంలో ఆర్సెనిక్ గాఢత ఎక్కువగా ఉన్నట్లు వారు కనుగొన్నారు. గర్భంలో ఉన్న పిండంపై, శిశువు జన్మించాక తొలినాళ్లలో కూడా రోగనిరోధక శక్తి, నరాల అభివృద్ధిపై ఆర్సెనిక్ వ్యతిరేక ప్రభావం చూపుతుందని గత పరిశోధనలు తేల్చాయి.
పాలిష్ పట్టిన బియ్యంలో ఆర్సెనిక్ గాఢత, శిశువులకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన 200 నానోగ్రామ్/గ్రామ్ కన్నా ఎక్కువ ఉంటుంది. ఒక ఏడాది వరకు వయసున్న పిల్లలు తినే అన్నం, మూత్రంలో ఆర్సెనిక్ గాఢతల మధ్య సంబంధాన్ని డార్ట్‌మౌత్ కళాశాల పరిశోధకులు పరిశీలించారు. 2011-2014 దాకా న్యూహాంప్‌షైర్‌లో జన్మించిన 759 మంది శిశువులపై అధ్యయనం చేశారు.