న్యూఢిల్లీ: ముంబై పేలుళ్లకు సూత్రధారి లష్కరే తోయిబా సహ వ్యవస్థాపకుడు, జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీద్ సయీద్‌కు పాకిస్తాన్ ప్రభుత్వం గృహ నిర్బంధం విధించడాన్ని అది భారత ప్రభుత్వ విజయంగా కొంత మంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముంబై పేలుళ్ల కేసులో సయీద్ పట్టి అప్పగించాల్సిందిగా ఎన్నో ఏళ్లుగా గత ప్రభుత్వం, దాదాపు మూడేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఎంత ఒత్తిడి తెచ్చిన, ఎన్ని హెచ్చరికలు చేసినా స్పందించని పాక్ ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు స్పందిస్తుంది?
సయీద్‌కు గృహ నిర్బంధం విధించినట్లు పాక్ ప్రభుత్వం కాకుండా పాక్ సైనిక అధికార ప్రతినిధి ప్రకటించడంలో కూడా మతలబు ఉండే ఉంటుంది. ఏడు ముస్లిం దేశాలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ట్రావెల్ బ్యాన్ నిషేధించిన నేపథ్యంలోనే సయీద్‌ను గృహ నిర్బంధంలోకి తీసుకోవడం గమనార్హం. ఎప్పుడు ఎలా వ్యవహరిస్తారో అంచనా వేయలేని ట్రంప్ తనపై నిషేధం విధించకుండా ముందుజాగ్రత్త వహించడంలో భాగంగానే పాక్ ప్రభుత్వం ఈ చర్య తీసుకొని ఉంటుంది. ఐఎస్‌ఐఎస్ టెర్రరిస్టులను సమూలంగా నిర్మూలిస్తామని ట్రంప్ శపథం చేయడం కూడా ఇక్కడ గమనార్హం.
భారత్ లాంటి దేశాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న జమాత్ ఉద్ దవా సంస్థ దేశీయంగా ఎలాంటి కార్యకలాపాలకు పాల్పడకూడదని హెచ్చరించేందుకు కూడా సయీద్‌ను గృహ నిర్బంధంలోకి తీసుకున్నారని పాక్ సైనిక వర్గాలే చెబుతున్నాయి. సయీద్‌ను అరెస్ట్ చేసి భారత్‌కు అప్పగించినప్పుడు మాత్రమే భారత్ ఒత్తిడికి లొంగిందనిగానీ, పాక్ వైఖరిలో మార్పు వచ్చిందనిగానీ భావించవచ్చు. తాము తమ వైఖరిని మార్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు అమెరికాకు ఓ సంకేతం పంపించేందుకే సయీద్‌పై ఈ చర్య తీసుకొని ఉండవచ్చని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి.