‘అణ్వస్త్రాలతో మా వైపు ఎందుకు?’
ప్యాంగ్‌యాంగ్: అమెరికాపై మరోసారి ఉత్తర కొరియా ఆగ్రహం వ్యక్తం చేసింది. పెద్ద మొత్తంలో వ్యూహాత్మక అణుబాంబులతో అమెరికా యుద్ధ నౌక కొరియా ద్వీపకల్పంలోకి రావడమేంటని ప్రశ్నించింది. అమెరికా యుద్ధ నౌక సమీపిస్తుండగానే ఆరోసారి ఉత్తర కొరియా అణుపరీక్ష జరిపేందుకు సిద్ధమవుతుండటం ఇప్పుడు కలవరాన్ని రేపుతోంది.
సిరియా అమాయక ప్రజలపై విషరసాయనాల దాడులు జరిగిన తర్వాత అక్కడి వైమానిక స్థావరాలపై అమెరికా ఏక కాలంలో మొత్తం 59 తొమాహక్ క్షిపణులతో దాడులు చేసిన విషయం తెలిసిందే. దీని ద్వారా పరోక్షంగా దూకుడుగా ఉన్న ఉత్తర కొరియా, చైనాకు అమెరికా హెచ్చరికలు చేసింది. అయినప్పటికీ ఉత్తర కొరియా ఏ మాత్రం వెనక్కి తగ్గకపోగా యుద్ధం వస్తే తాము సై అంటూ ప్రకటించింది. దీంతో అమెరికా కొరియాను సమీపిస్తోంది. మరోపక్క, ఇక మా వ్యూహాత్మక ఓపిక నశించిందని అమెరికా ప్రకటించడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.