
సొంత ఫేస్‌బుక్.. అంతలోనే హ్యాకయింది!
ఉత్తరకొరియా తాను సొంతంగా రూపొందించుకున్న ఫేస్‌బుక్ అంతలోనే హ్యాకయింది. హ్యాకర్లు దాన్ని ఆఫ్‌లైన్‌లోకి పంపేశారు. దాదాపు ఫేస్‌బుక్‌లాగే కనిపించే మరో సోషల్ మీడియా సైట్‌ను ఉత్తరకొరియాలో సృష్టించారు. దాన్ని ప్రపంచంలో ఎవరైనా యాక్సెస్ చేసేలా చూసుకున్నారు. 'పీహెచ్‌పీ డాల్ఫిన్' అనే సాఫ్ట్‌వేర్ టూల్ సాయంతో 'బెస్ట్ కొరియా' అనే ఈ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌ను రూపొందించారు. దాన్ని ఎవరైనా కొనుక్కుని, తమ సొంత ఫేస్‌బుక్ లాంటి నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ, కొరియన్లు రూపొందించిన సొంత ఫేస్‌బుక్‌కు డీఫాల్ట్ పాస్‌వర్డ్ ఉండటంతో హ్యాకర్లకు పని చాలా సులభమైంది.
ఓ స్కాటిష్ విద్యార్థి దాన్ని హ్యాక్ చేసి, అందులోని ప్రకటనల స్లాట్లన్నింటిలో తన సొంత మెసేజ్ ఒకటి పెట్టేశాడు. ''నేను ఈ సైట్‌ను తయారుచేయలేదు, కేవలం లాగిన్ వివరాలు కనుక్కున్నాను' అనే సందేశం పెట్టి, దాన్ని తన సొంత ట్విట్టర్ అకౌంటుకు లింక్ చేశాడు. దాంతో కొరియన్ల సొంత ఫేస్‌బుక్ కాస్తా బుక్కైపోయింది. ఈ సైట్‌ను ఉత్తర కొరియా సర్వర్‌లో రిజిస్టర్ చేసినా, దాన్ని సరిగ్గా ఎక్కడి నుంచి చేశారు, దాని వెనక ఎవరున్నారన్న విషయాలు మాత్రం తెలియలేదు.
అసలు ఉత్తర కొరియాకు సొంత ఫేస్‌బుక్ ఎందుకు సృష్టించాలనుకున్నారో కూడా తెలియరాలేదు. ఆ దేశంలో కేవలం కొన్నివేల మందికి మాత్రమే ఇంటర్‌నెట్ యాక్సెస్ ఉంది. అందులో కూడా ఫేస్‌బుక్ లాంటి పాశ్చాత్య సైట్లు చూసేందుకు వీల్లేదు. చాలా పరిమితులున్నాయి. గత సంవత్సరం దాదాపు పీహెచ్‌పీ డాల్ఫిన్ లాంటి టూల్‌తోనే ఐఎస్ఐఎస్ మద్దతుదారులు తమ సొంత ఫేస్‌బుక్ వ్యవస్థను ఏర్పాటుచేసుకున్నారు. కానీ దాన్ని కూడా హ్యాకర్లు వదిలిపెట్టలేదు. దాంతో కొద్ది రోజులకే అది పడుకుంది.