ప్యాంగ్‌యాంగ్: ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ తన మేనమామ జంగ్ సాంగ్ థీక్ (67)కు అత్యంత పాశవికమైన మరణ శిక్షను అమలు చేశాడు. ఒకటి.. రెండు కాదు సుమారు 120 వేట కుక్కలతో కరిపించి కిరాతకంగా హతమార్చడమే గాక, ఆ దృశ్యాలను ఉన్ ప్రత్యక్షంగా తిలకించినట్టు చైనా పత్రిక సంచలనాత్మక కథనాన్ని ప్రచురించింది. థీక్‌తో పాటు ఆయన ఐదుగురు అనుచరులను ఒంటిపై నూలుపోగు లేకుండా బోనులోకి నెట్టేసి.. వారిపైకి ఆకలితో ఉన్న 120 వేట కుక్కలను వదిలేశారని.. అవి వారిని వెంటాడి.. వేటాడి పీక్కుతిన్నాయని.. ఈ ఆటవిక శిక్షా కాండ సుమారు గంటకుపైగా సాగిందని చైనా పత్రిక వెన్ వెయ్ పో ఉటంకించింది. ఈ పాశవికమైన శిక్షను ‘క్వాన్ జ్యూ’ లేదా వేట కుక్కలతో అమలు చేసే శిక్షగా పిలుస్తారని ఆ పత్రిక వెల్లడించింది.
డిసెంబర్ 12న థీక్‌కు మరణ శిక్ష అమలు చేసినట్టు ఉత్తర కొరియా ప్రభుత్వం వెల్లడించింది. జోంగ్ ఇల్ అనంతరం 2011లో చిన్నవయసులో అధికారంలోకి వచ్చిన జోంగ్ ఉన్‌కు థీక్ సహాయంగా ఉంటూ ప్రభుత్వ, పార్టీ వ్యవహారాల్లో పట్టు సాధించాడు. అయితే ఆ తరువాత అధికారాన్ని తానే చేజిక్కుంచుకునేందుకు కుట్ర చేశాడని, దేశ ద్రోహానికి, అవినీతికి పాల్పడ్డాడనే నేరంపై మరణ శిక్ష విధించారు.