
చైనాలో ఈ అద్భుతం అదరహో
బీజింగ్: ప్రపంచంలోనే ఎత్తయిన ప్రాంతాల్లో అరుదైన కట్టడాలు నిర్మించి తన ప్రత్యేకతను చాటుకునే చైనా మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. దాదాపు వంద మీటర్ల ఎత్తులో ఓ పెద్ద కొండ చుట్టూ మరో ఫుట్ పాత్ లాంటి గ్లాస్ వంతెనను ఏర్పాటుచేసి అబ్బురపరిచింది. ఇటీవల నిర్మాణం పూర్తి చేసుకున్న దీనిపైకి సోమవారం నుంచే పర్యాటకులకు అనుమతిస్తున్నారు. జాంగ్జియాజి సెనిక్ ప్రాంతంలోని టియాన్ మెన్ పర్వతాల్లో 1.6 మీటర్ల వెడల్పుతో దీన్ని నిర్మించి పర్యాటకంలో భాగంగా ప్రారంభించారు.
దీంతో అందరూ దీనిపై నడిచే సాహసం చేసేందుకు బయలుదేరడంతోపాటు ఏం చక్కా సెల్ఫీలు దిగేందుకు సెల్ఫీ స్టిక్ లతో బయలుదేరారు. ఆకాశాన్ని అంటుకుందా అన్నట్లుగా ఈ పర్వతం ఉంటుంది. పై నుంచి కింది వరకు దాదాపు రాతి పొరతోనే కనిపించే ఈ పర్వతంపై మాత్రం చూడముచ్చటయ్యేలా పెద్ద పెద్ద చెట్లు ఉండటం విశేషం. ఈ వంతెనపై కొంతమంది ధైర్యంగా పరుగులు పెట్టేంతగా నడుస్తుండగా.. మరికొందరు తమ గుండెలు అరచేతపట్టుకొని సాగుతున్నారు. ప్రేమికులు ఏం చక్కా దానికి ఉంచిన రెయిలింగ్ పట్టుకొని సెల్ఫీలు తీసుకుంటుండగా కొంతమంది యువతులు సరదాగా గాల్లో వేలాడుతున్నట్లు ఫొటోలకు ఫోజులిస్తున్నారు.