అక్కడ.. క్యాంపస్ నియామకాల జోరు
అక్కడ.. క్యాంపస్ నియామకాల జోరు
Published Mon, Nov 28 2016 11:06 AM | Last Updated on Tue, Aug 27 2019 4:36 PM
అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో అమెరికా వీసా విధానం మరింత బిగుసుకునే ప్రమాదం కనిపిస్తుండటంతో.. భారత ఐటీ కంపెనీలు అక్కడ క్యాంపస్ నియామకాల జోరు పెంచాయి. దాంతోపాటు అమెరికాలో ఉన్న చిన్న చిన్న ఐటీ కంపెనీలను కొనేస్తున్నాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఇన్ఫోసిస్, విప్రో లాంటి సంస్థలు చాలా కాలంగా ఇక్కడ ఉన్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు హెచ్1-బి వీసాలు ఇప్పించి వాళ్లను అమెరికా, ఇతర దేశాలలోని క్లయింట్ లొకేషన్లకు తాత్కాలికంగా పంపుతున్నాయి. 2005-14 సంవత్సరాల మధ్య కేవలం ఈ మూడు కంపెనీల నుంచే హెచ్1-బి వీసాలు తీసుకున్నవాళ్లు దాదాపు 86వేల మంది ఉన్నారు.
ఇప్పుడు ట్రంప్ అధికారం చేపడుతుండటంతో.. చాలా కాలం నుంచి ఆయన చెబుతున్న మాట ఐటీ కంపెనీల్లో గుబులు పుట్టిస్తోంది. చాలా కాలంగా వీసా విధానాన్ని విమర్శిస్తున్న సెనెటర్ జెఫ్ సెషన్స్‌ను అటార్నీ జనరల్‌గా కూడా ఆయన ఎంచుకున్నారు. దాంతో అమెరికా వీసాల విషయంలో రక్షణాత్మక విధానాన్ని అవలంబిస్తుందని భావిస్తున్నారు. అయితే.. ఇక్కడివాళ్లు అనవసరంగా ఇమ్మిగ్రేషన్ విషయంలో బాగా నిపుణులైన తాత్కాలిక ఉద్యోగుల గురించి భయపడుతున్నారని, ఎందుకంటే తాము కేవలం కొన్నాళ్ల పాటు మాత్రమే ఇక్కడ ఉండి పనిచేస్తామని ఇన్ఫోసిస్‌లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా ఉన్న ప్రవీణ్ రావు తెలిపారు.
ఇప్పుడు హెచ్1-బి వీసాలను నియంత్రించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుండటంతో.. అమెరికాలోనే క్యాంపస్ నియామకాల ద్వారా స్థానికులను పెద్ద ఎత్తున తమ కంపెనీలలో చేర్చుకోవాలని ఐటీ దిగ్గజాలు భావిస్తున్నాయి. దానివల్ల అక్కడివారికి ఉద్యోగావకాశాలు కల్పించినట్లు అవ్వడంతో పాటు.. తమ కంపెనీల విషయంలో కాస్త చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తారనే ఆలోచన కూడా వస్తున్నట్లు సమాచారం. దాంతోపాటు అమెరికా, ఇతర దేశాల్లో ఉన్న చిన్నపాటి ఐటీ కంపెనీలను కొనేయడానికి కూడా ఈ కంపెనీలు సిద్ధమవుతున్నాయి. దానివల్ల తమ కంపెనీలలో పనిచేసే స్థానికుల సంఖ్య పెరుగుతుందని, పాతవాళ్లను పంపాల్సిన అవసరం ఉండదని భావిస్తున్నాయి.
Advertisement
Advertisement