అమెరికా అధ్యక్ష బాధ్యతలకు సెలవిచ్చేందుకు ఒబామాకు మిగిలిందిక కొన్ని క్షణాలే.. అయినప్పటికీ అంతకంటే ముందుగానే ఒబామా ఒక సాధారణ పౌరుడిగా తనను తాను మార్చుకున్నట్లు తెలుస్తోంది.
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష బాధ్యతలకు సెలవిచ్చేందుకు ఒబామాకు మిగిలిందిక కొన్ని క్షణాలే.. అయినప్పటికీ అంతకంటే ముందుగానే ఒబామా ఒక సాధారణ పౌరుడిగా తనను తాను మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఆయనకున్న బరువునంత ఇప్పటికే పక్కకు పెట్టి నేరుగా కొత్త అధ్యక్షుడిగా రాబోతున్న డోనాల్డ్ ట్రంప్ చేతుల్లో పెట్టేందుకు మానసికంగా కూడా సిద్ధమైనట్లు శ్వేత సౌదం వర్గాలు చెబుతున్నాయి.
దాదాపు ఎనిమిదేళ్లపాటు అమెరికా పీఠాన్ని అధిష్టించిన ఒబామా ఎన్నో కీలకమైన, సంచలనమైన నిర్ణయాలు తీసుకొని ప్రజలమెప్పు పొందారు. ఎనాడు హంగులు ఆర్భాటాలకు వెళ్లని ఒబామా చక్కటి వాక్పటిమతో ప్రపంచంమొత్తాన్ని ఆకట్టుకున్నారు. కఠిన నిర్ణయాలు తీసుకునే సమయంలో కూడా ప్రజాస్వామ్యానికి విలువ ఇచ్చేవారని కూడా ఆయనకు పేరుంది. కొన్ని గంటల్లో వైట్ హౌస్‌లోకి ట్రంప్ వెళుతున్న నేపథ్యంలో ఇప్పుడు వైట్ హౌస్ ఎలా ఉందంటే..
అధ్యక్షుడు బరాక్ బబామాతో సహా మిషెల్లీకి సంబంధించిన వస్తువులు అందులో పనిచేసే వారికి సంబంధించిన వస్తువులను పూర్తిగా తొలగించి ట్రంప్ కోసం సిద్ధం చేశారు. గతంలో ఇక్కడ ఏ గోడపై చూసినా ఒబామా కుటుంబ సభ్యుల ఫొటోలు కనిపించేవి వాటిని గురువారమే తొలగించి ప్రస్తుతం ఖాళీ ఫ్రేములే వదిలిపెట్టారు. మరోపక్క, ఆఖరి గడియల్లో ఒబామా అధికారికంగా ఓ విదేశీ అధినేతకు ఫోన్ చేశారు. ఆ అధినేత ఎవరో కాదు.. జర్మనీ ఛాన్సలర్ ఎంజెలా మెర్కెల్.
అవును.. ఒబామాకు మెర్కెల్‌కు మధ్య చాలా చక్కటి సంబంధాలు ఉన్నాయి. దక్షిణాసియా దేశాలతో సంబంధాలకోసం భారత్‌ను ఒబామా ఎంత ప్రాధాన్యంగా తీసుకున్నారో.. యూరోపియన్ యూనియన్‌తో సంబంధాల విషయంలో ఒబామా జర్మనీకి అంత ప్రాధాన్యం ఇచ్చారు. అధికారం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు మెర్కెల్‌కు చాలా ప్రాధాన్యం ఇచ్చారు. అందుకే ఆయన దిగిపోతున్న సమయంలో అధ్యక్షహోదాలో ఉండి చివరి ఫోన్‌కాల్‌ను ఫేర్‌వెల్ కాల్‌గా మెర్కెల్‌కు చేసి మాట్లాడారు.
ట్రంప్‌కు బాధ్యతలు అప్పగించాక..
ట్రంప్‌కు ఒబామా అధ్యక్ష బాధ్యతలు అప్పగించాక మాజీ అధ్యక్షుడిగా ఒబామా హెలికాప్టర్ ద్వారా ఆండ్రూ ఎయిర్ ఫోర్స్ బేస్‌కు వెళతారు. అక్కడే ఇంతకాలం సేవలు అందించిన వారికి ధన్యవాదాలు చెబుతున్నారు. వారు చేసిన సేవలను కొనియాడుతారు. అనంతరం ఆయన తన కుటుంబంతో సహా అధ్యక్ష విమానంలో తను కాలిఫోర్నియాకు వెళ్లాల్సిన విమానంకోసం ప్రయాణిస్తారు. అక్కడే పామ్ స్ప్రింగ్స్‌లో కొంత సేద తీరుతారు. అనంతరం తిరిగి వాషింగ్టన్ వచ్చి వారు అద్దెకు తీసుకున్న ఇంట్లో ఉంటూ ఆయన కూతురు శాషా తన హైస్కూల్ విద్యను పూర్తి చేసేవరకు ఉంటారు.