ఊబకాయం మరణాలు తగ్గుముఖం
లండన్: ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల్లో స్థూలకాయం ఒకటి. పాశ్చాత్య దేశాల్లోనే కాకుండా అభివృద్ధి చెందుతున్న భారత్ వంటి దేశాల్లోనూ ఈ సమస్య నానాటికీ తీవ్రమవుతోంది. అయితే స్థూలకాయుల సంఖ్య పెరుగుతున్నా దీని కారణంగా సంభవిస్తున్న మరణాలు గతంతో పోలిస్తే 30 శాతం తగ్గాయని కొపెన్‌హాగన్ వర్సిటీ అధ్యయనంలో తేలింది.
డెన్మార్క్‌లో స్థూలకాయం బారిన పడిన లక్షమందిపై చేసిన అధ్యయనంలో ఈ విషయం రుజువైంది. ‘1976-78 ప్రాంతంలో సాధారణ బరువున్న వ్యక్తులతో పోలిస్తే స్థూలకాయంబారిన పడినవారి మరణాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే 2003-13 ల్లో ఈ మరణాలు 30% తగ్గాయ’ని అధ్యయన బృందం సభ్యుడైన షోయబ్ అఫ్జల్ తెలిపారు. స్థూలకాయం ప్రాణాంతకం కాదని చెప్పడం తమ ఉద్దేశం కాదని, అయితే దీనిబారిన పడినవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పడం కోసమే అధ్యయన ఫలితాలను వివరిస్తున్నామన్నారు.