ఉడీ లాంటి దాడి తర్వాత ఉద్రిక్తతలు సహజం
ఉడీలో జరిగిన ఉగ్రదాడి చాలా దారుణమని, అలాంటి దాని తర్వాత ఇలాంటి ఉద్రిక్తతలు తలెత్తడం సహజమేనని అమెరికా తేల్చిచెప్పింది. ఈ అంశంపై అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ స్పందించారు. భారత సైన్యం నిర్వహించిన నిర్దేశిత దాడుల (సర్జికల్ స్ట్రైక్స్) గురించి చూశామని, పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని ఆయన అన్నారు. భారత్, పాక్ సైన్యాలు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారని భావిస్తున్నామని, ఉద్రిక్తతలను తగ్గించాలంటే ఇరువురి మధ్య కమ్యూనికేషన్ ఉండటం చాలా ముఖ్యమని చెప్పారు.
ఉగ్రవాదం వల్ల ఈ ప్రాంతానికి ముప్పు పొంచి ఉందన్న విషయాన్ని అమెరికా పదే పదే చెబుతూనే ఉందని, ఉగ్రవాదానికి సరిహద్దులు లేవని, అందువల్ల లష్కరే తాయిబా జైషే మహ్మద్ లాంటి ఉగ్రవాద గ్రూపులను అణిచేయలని, వాటిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు జాన్ కిర్బీ చెప్పారు. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి జాన్ కెర్రీ ఈనెల 27వ తేదీన భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌తో మాట్లాడారని, ఉడీ ఉగ్రదాడిని గట్టిగా ఖండిస్తున్నట్లు ఆయన చెప్పారని అన్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని తాము ఖండిస్తామని, దానివల్ల ఉద్రిక్తతలు తలెత్తకుండా చూసుకోవాలని తెలిపారు. ఈ దాడి గురించి తాను ప్రత్యకంగా చెప్పాలనుకోను గానీ... ఉడీ లాంటి ఉగ్రదాడుల వల్ల భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరగడం సహజమేనని జాన్ కిర్బీ అన్నారు. ఉడీ లాంటి దాడులు చాలా భయంకరమైనవని చెప్పారు. ఈతరుణంలో భారత్, పాకిస్థాన్ రెండు దేశాలకూ తము ఇచ్చే సందేశం ఒకటేనని.. ఇరు దేశాల మధ్య చర్చలు పెరిగి, ఉద్రిక్తతలను మరింత పెంచే చర్యలు మానుకోవాలని సూచించారు.