జెనీవా/న్యూఢిల్లీ: అమెరికా– ఉత్తర కొరియా మధ్య యుద్ధవాతావరణం నెలకొన్న నేపథ్యంలో.. ఉత్తర కొరియా, భారత్‌ల మధ్య నెలకొన్న దౌత్య సంబంధాలు ఉద్రిక్త సమయాల్లో సమాచార సాధనంగా ఉపయోగపడగలవని భావిస్తున్నట్లు యూఎస్ విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్‌సన్ వ్యాఖ్యానించారు. ఉత్తరకొరియాలో భారత ఎంబసీని మూసేసే ప్రతిపాదనపై ఢిల్లీలో టిల్లర్‌సన్, భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ల మధ్య జరిగిన చర్చల వివరాలను జెనీవాలో టిల్లర్‌సన్ మీడియాకు వివరించారు.
ఇరుదేశాల విదేశాంగ మంత్రుల చర్చల సందర్భంగా.. ఉత్తరకొరియాలో భారత దౌత్య కార్యాలయాన్ని మూసేయబోమని సుష్మా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అందుకు కారణంగా.. ఉత్తర కొరియాతో తమ వాణిజ్య బంధం అత్యంత స్వల్పమైందని, అలాగే, భారత్– ఉత్తరకొరియా మధ్య నెలకొన్న దౌత్య సంబంధాలు ఒక ఉపయుక్తమైన సమాచార సాధనంగా ఉపయోగపడగలవని టిల్లర్‌సన్‌కు సుష్మా వివరించారు. సుష్మా ఇచ్చిన వివరణనే స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో టిల్లరసన్ మీడియాకు వివరించారు. ఆ వివరణతో మీరు సంతృప్తి చెందారా? అన్న ప్రశ్నకు.. ‘అందుకు అవకాశముంది’ అంటూ ఆయన బదులివ్వడం విశేషం. ఐరాస ఆంక్షల నేపథ్యంలో ఈ ఏప్రిల్ నుంచి ఔషధాలు, ఆహారోత్పత్తులు మినహా.. ఉత్తరకొరియాతో అన్ని వాణిజ్య సంబంధాలను భారత్ నిషేధించింది.
యుద్ధం మా లక్ష్యం కాదు
ఉత్తర కొరియాతో యుద్ధం అమెరికా లక్ష్యం కాదని అమెరికా రక్షణ మంత్రి మాటిస్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. ‘యుద్ధం కాదు.. దౌత్యపరమైన పరిష్కారాన్నే మేము కోరుకుంటున్నాం. ఇదే విషయాన్ని మా విదేశాంగ మంత్రి టిల్లర్‌సన్ ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే, కొరియా ద్వీపకల్పంలో పూర్తి స్థాయిలో అణ్వాయుధ నిర్మూలన జరగాలి.. అదే మా లక్ష్యం’ అని మాటిస్ స్పష్టం చేశారు. కాగా, నవంబర్ 7, 8 తేదీల్లో ట్రంప్ దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు.
మీ వల్ల కాదా?... మేమే చేస్తాం..
ఉగ్రవాదం నిర్మూలనపై పాక్‌కు అమెరికా స్పష్టీకరణ
వాషింగ్టన్: ఉగ్ర సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవడంలో పాకిస్తాన్ విఫలమైతే, తగిన వ్యూహాలతో తామే ఆ పనిని పూర్తిచేస్తామని అమెరికా స్పష్టం చేసింది. పాకిస్తాన్ భూభాగంలో ఉన్న ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయాలని ఇటీవలే అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్‌సన్ తన పర్యటన సందర్భంగా ఆ దేశాన్ని కోరిన సంగతి తెలిసిందే. ‘ ‘ఉగ్రవాదంపై చర్యలకు సంబంధించి మేం ఏం ఆశిస్తున్నామో ఇదివరకే పాక్‌కు చాలాసార్లు తెలియజేశాం.
అయినా ఈ విషయంలో ఆ దేశం విఫలమైతే మేమే మా వ్యూహాలను మార్చుకుని ఆ లక్ష్యాన్ని సాధిస్తాం’ అని అమెరికా విదేశాంగ మంత్రి టిల్లర్‌సన్ పేర్కొన్నట్లు అధికార ప్రతినిధి హీథర్ నావెర్ట్ చెప్పారు. తన విదేశీ పర్యటనలో భాగంగా చివరగా జెనీవా చేరుకున్న టిల్లర్‌సన్ మాట్లాడుతూ...ఉగ్రవాదులకు సంబంధించిన సమాచారాన్ని చాలా దేశాలతో పంచుకుంటున్నామని, పాక్ కూడా తమతో ఆ సమాచారాన్ని పంచుకోవాలని కోరుకుంటున్నామని అన్నారు. ‘ అమెరికా పాక్‌కు చెప్పేది ఏంటంటే...ఉగ్రవాదంపై చర్యలు తీసుకోండి. ఆ పని చేయండని కోరుతున్నాం. డిమాండ్ చేయట్లేదు. మీది ఓ సార్వభౌమ దేశం. ఏం చేయాలో నిర్ణయించుకునే హక్కు మీకుంది.
కాని మేం చెబుతున్న దాని అవసరాన్ని గుర్తించండి. మీరు అలా చేయడానికి ఇష్టపడకపోతే...ఆ పని పూర్తిచేయడానికి మాకు సొంత ప్రణాళికలు, వ్యూహాలు ఉన్నాయి’ అని టిల్లర్‌సన్ అన్నారు. పాక్ నాయకత్వంతో తన చర్చలు ఓ ఉపన్యాస కార్యక్రమంగా ఉండాలని కోరుకోవట్లేదన్నారు. వారితో సూటిగా, నిర్మొహమాటంగా తన అభిప్రాయాలు పంచుకున్నానని వెల్లడించారు. ‘ మా వాదనలు, కోరికలు ఏంటో పాక్ ముందు ఉంచాం. నేను వెళ్లక ముందు పాక్–అమెరికా మధ్య చర్చలు జరిగాయి. ఉగ్ర సంస్థల నిర్మూలన కోసం పరస్పర సమాచార మార్పిడికి భవిష్యత్తులో కూడా అవి కొనసాగుతాయి’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment