Rex Tillarson
-
విదేశాంగ మంత్రికి షాకిచ్చిన ట్రంప్
వాషింగ్టన్ : అమెరికా విదేశాంగ శాఖ మంత్రి రెక్స్ టిల్లర్సన్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టి షాక్ ఇచ్చారు. పదవి నుంచి తొలగించి, ఆయన స్థానంలో మైక్ పాంపీని నియమించిస్తున్నుట్లు ప్రకటించారు. జాతీయ భద్రతా అంశాలకు సంబంధించి ఉత్తర కొరియాతో చర్చలు జరుపుతున్న నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని వైట్‌హౌజ్ ప్రతినిధులు మంగళవారం తెలియజేశారు. ఇందులో భాగంగానే సెంట్రల్ ఇంటిలెజెన్స్ ఏజెన్సి(సీఐఏ) డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మైక్ పాంపీని విదేశాంగ మంత్రిగా నియమించినట్లు ‘ది వాషింగ్టన్ పోస్ట్’ పత్రికకు ఇచ్చిన ప్రకటనలో పేర్కొన్నారు. ఆ పదవికి మైక్ మాత్రమే అర్హులు: ట్రంప్ గత శుక్రవారమే రెక్స్ టిల్లర్సన్ను పదవి నుంచి వైదొలగాలని హెచ్చరించిన ట్రంప్ అన్నంతపని చేశారు. సీఐఏ డైరెక్టర్‌గా అపార అనుభమున్న మైక్ పాంపీని విదేశాంగ మంత్రి పదవి ఎంపిక చేసినందుకు గర్వపడుతున్నానని ట్రంప్ వ్యాఖ్యానించారు. హార్వర్డ్ లా స్కూల్లో ఆనర్స్ పట్టా పొంది, యూఎస్ ఆర్మీలో పనిచేసిన గొప్ప వ్యక్తి మైక్ అని కొనియాడారు. ఆయన స్థానంలో గినా హాస్పెల్...! సీఐఏ డైరెక్టర్ పదవికి ప్రస్తుత డిప్యూటీ డైరెక్టర్ గినా హాస్పెల్ను నామినేట్ చేయనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఇదేగనక నిజమైతే అమెరికా చరిత్రలో గూఢాచార సంస్థకు డైరెక్టర్‌గా ఎన్నికైన తొలి మహిళగా గినా హాస్పెల్ చరిత్ర సృష్టించనున్నారు. ‘ముప్పై ఏళ్ల సర్వీసున్న తనకు త్వరలోనే ప్రమోషన్ రాబోతుందని, అందుకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’నని గినా హాస్పెల్ అన్నారు. తనకు ఈ అవకాశం కల్పించినందుకు అధ్యక్షునికి ధన్యవాదాలు తెలిపారు. -
'ఉత్తర కొరియా రెడీ అయింది.. మరి మీరు'
ప్యాంగ్యాంగ్ : తమ అణు విధానంపై అమెరికాతో ప్రత్యక్షంగా బహిరంగంగా చర్చలు జరిపేందుకు ఉత్తర కొరియా సిద్ధంగా ఉందని రష్యా విదేశాంగ మంత్రి సెర్జెయ్ లారోవ్ తెలిపారు. ఈ విషయాన్ని తాను అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్సన్కు కూడా తెలియజేసినట్లు చెప్పారు. గురువారం వియన్నాలో జరిగిన దౌత్య వేత్తల సమావేశంలో తాను ఈ సందేశాన్ని చెప్పినట్లు వివరించారు. అయితే, టిల్లర్ సన్ నుంచి వెంటనే ఎలాంటి స్పందన రాలేదని, ముందు ఉత్తర కొరియా తన అణు కార్యక్రమాలను వదిలేసుకుంటేనే ముందుకు వెళతామనే ఆలోచనలో ఉన్నట్లు అర్థమైందని అన్నారు. ఐక్యరాజ్యసమితి ఉన్నత శ్రేణి అధికారి జెఫ్రీ ఫెల్ట్మేన్ ఉత్తర కొరియా విదేశాంగ మంత్రి రియాంగ్ హోను ప్యాంగ్యాంగ్లో కలిసిన సందర్భంగా చర్చల అంశాన్ని ముందుకు తీసుకొచ్చారని, అందుకు ఉత్తర కొరియా సానుకూలంగా స్పందించిందని తెలిపారు. -
ఉ.కొరియాలో ఆ ఎంబసీ మంచిదే
జెనీవా/న్యూఢిల్లీ: అమెరికా– ఉత్తర కొరియా మధ్య యుద్ధవాతావరణం నెలకొన్న నేపథ్యంలో.. ఉత్తర కొరియా, భారత్‌ల మధ్య నెలకొన్న దౌత్య సంబంధాలు ఉద్రిక్త సమయాల్లో సమాచార సాధనంగా ఉపయోగపడగలవని భావిస్తున్నట్లు యూఎస్ విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్సన్ వ్యాఖ్యానించారు. ఉత్తరకొరియాలో భారత ఎంబసీని మూసేసే ప్రతిపాదనపై ఢిల్లీలో టిల్లర్సన్, భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ల మధ్య జరిగిన చర్చల వివరాలను జెనీవాలో టిల్లర్సన్ మీడియాకు వివరించారు. ఇరుదేశాల విదేశాంగ మంత్రుల చర్చల సందర్భంగా.. ఉత్తరకొరియాలో భారత దౌత్య కార్యాలయాన్ని మూసేయబోమని సుష్మా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అందుకు కారణంగా.. ఉత్తర కొరియాతో తమ వాణిజ్య బంధం అత్యంత స్వల్పమైందని, అలాగే, భారత్– ఉత్తరకొరియా మధ్య నెలకొన్న దౌత్య సంబంధాలు ఒక ఉపయుక్తమైన సమాచార సాధనంగా ఉపయోగపడగలవని టిల్లర్సన్కు సుష్మా వివరించారు. సుష్మా ఇచ్చిన వివరణనే స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో టిల్లరసన్ మీడియాకు వివరించారు. ఆ వివరణతో మీరు సంతృప్తి చెందారా? అన్న ప్రశ్నకు.. ‘అందుకు అవకాశముంది’ అంటూ ఆయన బదులివ్వడం విశేషం. ఐరాస ఆంక్షల నేపథ్యంలో ఈ ఏప్రిల్ నుంచి ఔషధాలు, ఆహారోత్పత్తులు మినహా.. ఉత్తరకొరియాతో అన్ని వాణిజ్య సంబంధాలను భారత్ నిషేధించింది. యుద్ధం మా లక్ష్యం కాదు ఉత్తర కొరియాతో యుద్ధం అమెరికా లక్ష్యం కాదని అమెరికా రక్షణ మంత్రి మాటిస్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. ‘యుద్ధం కాదు.. దౌత్యపరమైన పరిష్కారాన్నే మేము కోరుకుంటున్నాం. ఇదే విషయాన్ని మా విదేశాంగ మంత్రి టిల్లర్సన్ ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే, కొరియా ద్వీపకల్పంలో పూర్తి స్థాయిలో అణ్వాయుధ నిర్మూలన జరగాలి.. అదే మా లక్ష్యం’ అని మాటిస్ స్పష్టం చేశారు. కాగా, నవంబర్ 7, 8 తేదీల్లో ట్రంప్ దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. మీ వల్ల కాదా?... మేమే చేస్తాం.. ఉగ్రవాదం నిర్మూలనపై పాక్‌కు అమెరికా స్పష్టీకరణ వాషింగ్టన్: ఉగ్ర సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవడంలో పాకిస్తాన్ విఫలమైతే, తగిన వ్యూహాలతో తామే ఆ పనిని పూర్తిచేస్తామని అమెరికా స్పష్టం చేసింది. పాకిస్తాన్ భూభాగంలో ఉన్న ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయాలని ఇటీవలే అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్సన్ తన పర్యటన సందర్భంగా ఆ దేశాన్ని కోరిన సంగతి తెలిసిందే. ‘ ‘ఉగ్రవాదంపై చర్యలకు సంబంధించి మేం ఏం ఆశిస్తున్నామో ఇదివరకే పాక్‌కు చాలాసార్లు తెలియజేశాం. అయినా ఈ విషయంలో ఆ దేశం విఫలమైతే మేమే మా వ్యూహాలను మార్చుకుని ఆ లక్ష్యాన్ని సాధిస్తాం’ అని అమెరికా విదేశాంగ మంత్రి టిల్లర్సన్ పేర్కొన్నట్లు అధికార ప్రతినిధి హీథర్ నావెర్ట్ చెప్పారు. తన విదేశీ పర్యటనలో భాగంగా చివరగా జెనీవా చేరుకున్న టిల్లర్సన్ మాట్లాడుతూ...ఉగ్రవాదులకు సంబంధించిన సమాచారాన్ని చాలా దేశాలతో పంచుకుంటున్నామని, పాక్ కూడా తమతో ఆ సమాచారాన్ని పంచుకోవాలని కోరుకుంటున్నామని అన్నారు. ‘ అమెరికా పాక్‌కు చెప్పేది ఏంటంటే...ఉగ్రవాదంపై చర్యలు తీసుకోండి. ఆ పని చేయండని కోరుతున్నాం. డిమాండ్ చేయట్లేదు. మీది ఓ సార్వభౌమ దేశం. ఏం చేయాలో నిర్ణయించుకునే హక్కు మీకుంది. కాని మేం చెబుతున్న దాని అవసరాన్ని గుర్తించండి. మీరు అలా చేయడానికి ఇష్టపడకపోతే...ఆ పని పూర్తిచేయడానికి మాకు సొంత ప్రణాళికలు, వ్యూహాలు ఉన్నాయి’ అని టిల్లర్సన్ అన్నారు. పాక్ నాయకత్వంతో తన చర్చలు ఓ ఉపన్యాస కార్యక్రమంగా ఉండాలని కోరుకోవట్లేదన్నారు. వారితో సూటిగా, నిర్మొహమాటంగా తన అభిప్రాయాలు పంచుకున్నానని వెల్లడించారు. ‘ మా వాదనలు, కోరికలు ఏంటో పాక్ ముందు ఉంచాం. నేను వెళ్లక ముందు పాక్–అమెరికా మధ్య చర్చలు జరిగాయి. ఉగ్ర సంస్థల నిర్మూలన కోసం పరస్పర సమాచార మార్పిడికి భవిష్యత్తులో కూడా అవి కొనసాగుతాయి’ అని తెలిపారు. -
ఉగ్ర పీచమణచాల్సిందే
న్యూఢిల్లీ: పాకిస్తాన్ భూభాగంలో ఉగ్ర స్థావరాలను సహించబోమని భారత్, అమెరికా స్పష్టం చేశాయి. పాక్ప్రభుత్వ స్థిరత్వానికి కూడా ముప్పుగా మారిన అలాంటి సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఆ దేశానికి సూచించాయి. బుధవారం భారత పర్యటనకు వచ్చిన అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్సన్ ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... ఉగ్రవాదం, వారి మౌలిక వసతులు, ఉగ్ర స్థావరాలను నిర్మూలించడం భారత్, అమెరికా ఉమ్మడి లక్ష్యాలన్నారు. భారత్–అమెరికా సంబంధాలు బలోపేతం కావడం కేవలం రెండు దేశాలకే ప్రయోజనకరం కాదని, అది మొత్తం ఆసియా, ప్రపంచ అభివృద్ధికి దోహదపడుతుందని మోదీ, టిల్లర్సన్ చెప్పారు. అంతకుముందు టిల్లర్సన్.. విదేశాంగ మంత్రి సుష్మతో భేటీ అయ్యారు. హెచ్–1బీ వీసా విధానాల్లో చేస్తున్న మార్పుల వల్ల భారత ఐటీ నిపుణుల ప్రయోజనాలు దెబ్బతినకుండా చూడాలని సుష్మ కోరారు. -
ట్రంప్‌పై విదేశాంగమంత్రి సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఆ దేశ విదేశాంగ మంత్రి టెక్స్ టిల్లర్సన్ మధ్య దూరం పెరిగిపోతోంది. తాజాగా ట్రంప్‌ను ఓ 'మూర్ఖుడి'గా అభివర్ణించిన టిల్లర్సన్.. ఈ వేసవినాటికి తన మంత్రి పదవి నుంచి తప్పుకోవాలని భావిస్తున్నారు. ఈ మేరకు విశ్వసనీయమైన ఉన్నత అధికార వర్గాలను ఉటంకిస్తూ ఎన్బీసీ న్యూస్ బుధవారం ఒక కథనాన్ని ప్రసారం చేసింది. బాయ్ స్కౌట్స్ ఆఫ్ అమెరికా సమావేశంలో ట్రంప్ రాజకీయపరమైన ఉపన్యాసం చేయడంతో ఇద్దరి మధ్య విభేదాలు తీవ్రంగా పెరిగిపోయాయి. ఒకప్పుడు బాయ్ స్కౌట్స్ ఆఫ్ అమెరికాకు నాయకత్వం వహించిన టిల్లర్సన్కు ట్రంప్ తీరు ఎంతమాత్రం గిట్టడం లేదని సీనియర్ అధికార వర్గాలు తెలిపాయి. గతంలో ట్రంప్‌తో టిల్లర్సన్ బహిరంగంగా విభేదించిన సంగతి తెలిసిందే. జూలై 20న పెంటగాన్‌లో అధ్యక్షుడి జాతీయ భద్రతా బృందంతో జరిగిన సమావేశంలో టిల్లర్సన్ మాట్లాడుతూ ట్రంప్‌ను ఓ మూర్ఖుడిగా అభివర్ణించారని, ఈ సమావేశం గురించి తెలిసిన ముగ్గురు అధికారులు తెలిపారు. అధ్యక్షుడి తర్వాత హోదాపరంగా నాలుగోస్థానంలో ఉన్న టిల్లర్సన్.. ట్రంప్ తీరుపై తీవ్రంగా విభేదించినప్పటికీ.. ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ఆయనను సముదాయించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఆయన రాజీనామాకు సిద్ధపడినప్పటికీ.. కనీసం ఈ ఏడాది చివరివరకైనా పదవిలో కొనసాగాలంటూ అధికార వర్గాలు ఆయనను కోరాయి. ట్రంప్ యంత్రాంగంలో చేరే ఉద్దేశమే తనకు లేదని, కానీ తన భార్య చెప్పడంతోనే విదేశాంగ శాఖను చేపట్టినట్టు ఎక్సాన్ మొబైల్ సంస్థ మాజీ ఎగ్జిక్యూటివ్ అయిన టిల్లర్సన్ గత మార్చిలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆయన విదేశాంగశాఖను చేపట్టినప్పటికీ క్రియాశీలంగా వ్యవహరించడం లేదు. ముభావంగా కొనసాగుతున్న ఆయన తన శాఖలో తీవ్రంగా ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేయడం లేదు. దీనికితోడు వైట్‌హౌస్ అధికార వర్గంతోనూ దూరంగా మసులుకుంటున్నారు. -
విరుచుపడిన ట్రంప్: చర్చలు శుద్ధ దండగ
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా విషయంలో మరోసారి విరుచుపడ్డారు. ఉత్తర కొరియాతో సంప్రదింపులు జరుపుతామంటూ తమ విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్సన్ చేసిన వ్యాఖ్యలపై ట్రంప్ మండిపడ్డారు. ఉత్తర కొరియాతో సంప్రదింపులు జరుపడం శుద్ధ దండగని, సమయాన్ని వృధా చేయడమేనని ఆయనకు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. బిల్ క్లింటన్, జార్జ్ బుష్, బరాక్ ఒబామా లాగా తాను విఫలం చెందనని చెప్పారు. ''మా అత్యంత అద్భుతమైన విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లరసన్కి చెబుతున్నా. లిటిల్ రాకెట్ మ్యాన్‌తో సంప్రదింపులకు ప్రయత్నించడం సమయాన్ని వృధా చేసుకోవడమే. మీలో ఉన్న శక్తిని ఆదా చేసుకోండి. ఇప్పటి వరకు చేసిన మాదిరిగానే మేము మా పనిచేస్తాం'' అని హెచ్చరిస్తూ ట్రంప్ పలు ట్వీట్లు చేశారు. రాకెట్ మ్యాన్‌తో మంచిగా ఉండటం గత 25 సంవత్సరాలుగా కుదరలేదని, మరి ఇప్పుడెందుకు జరుగుతుందంటూ ప్రశ్నించారు. ఈ విషయంలో క్లింటన్, బుష్, ఒబామాలు విఫలయ్యారని, తాను మాత్రం అసలు ఓడిపోదలుచుకోలేదని చెప్పారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ను ట్రంప్ అంతకముందు రాకెట్ మ్యాన్‌గా అభివర్ణించారు. చైనాలో ఉన్న టిల్లర్సన్.. ఉత్తర కొరియాతో నేరుగా మాట్లాడగల కమ్యునికేషన్ వ్యవస్థ తమకు ఉందని, దానిని ఇప్పటికీ కొనసాగిస్తున్నామని చెప్పారు. బీజింగ్‌లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను కలిసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉత్తర కొరియా, అమెరికాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో యుద్ధ వాతావరణం నెలకొంది. టిల్లర్సన్పై నిర్ణయాన్ని తప్పుబడుతూ ట్రంప్ చేసిన ట్వీట్లను అమెరికా మీడియా భారీ ఎత్తున ఎత్తిచూపింది. అధ్యక్షుడికి, విదేశాంగ మంత్రికి మధ్య ఉన్న తేడాను అమెరికా మీడియా ఎక్కువగా హైలైట్ చేసింది. -
మోదీతో అమెరికా మంత్రులు
వాషింగ్టన్: మోదీతో అమెరికా రక్షణ, విదేశాంగ మంత్రులు జేమ్స్ మాటిస్, రెక్స్ టిల్లర్సన్లు సోమవారం విడివిడిగా భేటీ అయ్యారు. మోదీ బసచేసిన హోటల్ విలార్డ్ కాంటినెంటల్‌లో జరిగిన సమావేశాల్లో ఆయా రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల బలపేతంపై చర్చలు జరిపారు. మాటిస్‌తో జరిగిన భేటీలో భారత జాతీయ సలహాదారు అజిత్ దోవల్, ఇతర భారత సీనియర్ అధికారులు పాల్గొన్నారు. భారత నిఘా అవసరాల కోసం అమెరికా 22 ‘గార్డియన్’ డ్రోన్లను అమ్మనుందన్న వార్తల నేపథ్యంలో భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. దాదాపు మూడు బిలియన్ డాలర్ల విలువైన ఈ ఒప్పందం ఇరు దేశాల సంబంధాలను కీలక మలుపు తిప్పుతుందని భావిస్తున్నారు. కాగా, ఇరు దేశాల వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసే మార్గాలపై టిల్లర్సన్, మోదీలు చర్చించారు.