వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఆ దేశ విదేశాంగ మంత్రి టెక్స్ టిల్లర్సన్ మధ్య దూరం పెరిగిపోతోంది. తాజాగా ట్రంప్‌ను ఓ 'మూర్ఖుడి'గా అభివర్ణించిన టిల్లర్సన్.. ఈ వేసవినాటికి తన మంత్రి పదవి నుంచి తప్పుకోవాలని భావిస్తున్నారు. ఈ మేరకు విశ్వసనీయమైన ఉన్నత అధికార వర్గాలను ఉటంకిస్తూ ఎన్బీసీ న్యూస్ బుధవారం ఒక కథనాన్ని ప్రసారం చేసింది.
బాయ్ స్కౌట్స్ ఆఫ్ అమెరికా సమావేశంలో ట్రంప్ రాజకీయపరమైన ఉపన్యాసం చేయడంతో ఇద్దరి మధ్య విభేదాలు తీవ్రంగా పెరిగిపోయాయి. ఒకప్పుడు బాయ్ స్కౌట్స్ ఆఫ్ అమెరికాకు నాయకత్వం వహించిన టిల్లర్సన్‌కు ట్రంప్ తీరు ఎంతమాత్రం గిట్టడం లేదని సీనియర్ అధికార వర్గాలు తెలిపాయి.
గతంలో ట్రంప్‌తో టిల్లర్సన్ బహిరంగంగా విభేదించిన సంగతి తెలిసిందే. జూలై 20న పెంటగాన్‌లో అధ్యక్షుడి జాతీయ భద్రతా బృందంతో జరిగిన సమావేశంలో టిల్లర్సన్ మాట్లాడుతూ ట్రంప్‌ను ఓ మూర్ఖుడిగా అభివర్ణించారని, ఈ సమావేశం గురించి తెలిసిన ముగ్గురు అధికారులు తెలిపారు. అధ్యక్షుడి తర్వాత హోదాపరంగా నాలుగోస్థానంలో ఉన్న టిల్లర్సన్.. ట్రంప్ తీరుపై తీవ్రంగా విభేదించినప్పటికీ.. ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ఆయనను సముదాయించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఆయన రాజీనామాకు సిద్ధపడినప్పటికీ.. కనీసం ఈ ఏడాది చివరివరకైనా పదవిలో కొనసాగాలంటూ అధికార వర్గాలు ఆయనను కోరాయి.
ట్రంప్ యంత్రాంగంలో చేరే ఉద్దేశమే తనకు లేదని, కానీ తన భార్య చెప్పడంతోనే విదేశాంగ శాఖను చేపట్టినట్టు ఎక్సాన్ మొబైల్ సంస్థ మాజీ ఎగ్జిక్యూటివ్ అయిన టిల్లర్సన్ గత మార్చిలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆయన విదేశాంగశాఖను చేపట్టినప్పటికీ క్రియాశీలంగా వ్యవహరించడం లేదు. ముభావంగా కొనసాగుతున్న ఆయన తన శాఖలో తీవ్రంగా ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేయడం లేదు. దీనికితోడు వైట్‌హౌస్ అధికార వర్గంతోనూ దూరంగా మసులుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment