వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా విషయంలో మరోసారి విరుచుపడ్డారు. ఉత్తర కొరియాతో సంప్రదింపులు జరుపుతామంటూ తమ విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్‌సన్ చేసిన వ్యాఖ్యలపై ట్రంప్ మండిపడ్డారు. ఉత్తర కొరియాతో సంప్రదింపులు జరుపడం శుద్ధ దండగని, సమయాన్ని వృధా చేయడమేనని ఆయనకు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. బిల్ క్లింటన్, జార్జ్ బుష్, బరాక్ ఒబామా లాగా తాను విఫలం చెందనని చెప్పారు. ''మా అత్యంత అద్భుతమైన విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లరసన్‌కి చెబుతున్నా. లిటిల్ రాకెట్ మ్యాన్‌తో సంప్రదింపులకు ప్రయత్నించడం సమయాన్ని వృధా చేసుకోవడమే. మీలో ఉన్న శక్తిని ఆదా చేసుకోండి. ఇప్పటి వరకు చేసిన మాదిరిగానే మేము మా పనిచేస్తాం'' అని హెచ్చరిస్తూ ట్రంప్ పలు ట్వీట్లు చేశారు. రాకెట్ మ్యాన్‌తో మంచిగా ఉండటం గత 25 సంవత్సరాలుగా కుదరలేదని, మరి ఇప్పుడెందుకు జరుగుతుందంటూ ప్రశ్నించారు.
ఈ విషయంలో క్లింటన్, బుష్, ఒబామాలు విఫలయ్యారని, తాను మాత్రం అసలు ఓడిపోదలుచుకోలేదని చెప్పారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ను ట్రంప్ అంతకముందు రాకెట్ మ్యాన్‌గా అభివర్ణించారు. చైనాలో ఉన్న టిల్లర్‌సన్.. ఉత్తర కొరియాతో నేరుగా మాట్లాడగల కమ్యునికేషన్ వ్యవస్థ తమకు ఉందని, దానిని ఇప్పటికీ కొనసాగిస్తున్నామని చెప్పారు. బీజింగ్‌లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను కలిసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉత్తర కొరియా, అమెరికాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో యుద్ధ వాతావరణం నెలకొంది. టిల్లర్‌సన్‌పై నిర్ణయాన్ని తప్పుబడుతూ ట్రంప్ చేసిన ట్వీట్లను అమెరికా మీడియా భారీ ఎత్తున ఎత్తిచూపింది. అధ్యక్షుడికి, విదేశాంగ మంత్రికి మధ్య ఉన్న తేడాను అమెరికా మీడియా ఎక్కువగా హైలైట్ చేసింది.