'ట్రంప్ గోడ'కు డబ్బులివ్వం
మెక్సికో సిటీ: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో, విజయం సాధించిన తరువాత ట్రంప్ పదేపదే చెబుతున్న మాట.. మెక్సికో సరిహద్దులో కట్టబోయే గోడ గురించే. అక్రమ వలసదారులను దేశంలోకి రానివ్వకుండా మెక్సికో సరిహద్దులో భారీ గోడ కడతాం అని తాజాగా నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సైతం ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. అంతేకాదు గోడ నిర్మాణ ఖర్చును కూడా పొరుగుదేశం పంచుకుంటుందని ఆయన తెలిపారు.
ఈ నేపథ్యంలో మెక్సికో అధ్యక్షుడు ఎన్రిక్ పెన నీటో 'ట్రంప్ గోడ'పై స్పందించారు. అమెరికా కొత్త ప్రభుత్వంతో తమకు కొన్ని విభేదాలున్నాయనడానికి ఇది నిదర్శనం అన్న ఆయన.. గోడకు తమ వైపు నుంచి ఎలాంటి చెల్లింపులు ఉండబోవని తెలిపారు. గత సెప్టెంబర్‌లో ట్రంప్‌తో సమావేశమైన సందర్భంలో కూడా నీటో ఇదే విషయాన్ని వెల్లడించిన విషయం తెలిసిందే. ట్రంప్ మాత్రం బుధవారం ప్రెస్‌మీట్‌లో గోడ కోసం మెక్సికో ఇచ్చే డబ్బులను మళ్లీ రీయింబర్స్ చేస్తామని చెప్పడమే కాకుండా.. ‘గుర్తుంచుకోండి ఇది జరుగుతుంది’ అని కాన్ఫిడెంట్‌గా అన్నారు. చూడాలి మరి మెక్సికో సహకారంతోనే గోడ నిర్మాణం జరుగుతుందో.. లేక అమెరికా సొంతంగానే ఈ పనికి పూనుకోవాల్సి వస్తుందో.