అమెరికా–మెక్సికో గోడకు 1.6 బిలియన్ డాలర్లు
వాషింగ్టన్: మాదకద్రవ్యాల ప్రవాహం, అక్రమ వలసలను అరికట్టేందుకు మెక్సికో సరిహద్దులో గోడ నిర్మిస్తానని ఎన్నికల సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన హామీ అమలు దిశగా తొలి అడుగు పడింది. ఈ వివాదాస్పద గోడ నిర్మాణానికి 1.6 బిలియన్ డాలర్లు సహా 827 బిలియన్ డాలర్ల ప్యాకేజీకి అమెరికా ప్రతినిధుల సభ ఆమోదముద్ర వేసింది. ఇందులో గోడ కోసం 1.6 బిలియన్లు కేటాయించింది.
గురువారం ప్రవేశపెట్టిన ఈ బిల్లు 235–192 ఓట్లతో పాసయింది. ఈ బిల్లు ప్రతిపక్ష డెమోక్రాట్ల బలం ఉన్న సెనేట్‌లోనూ ఆమోదం పొందాలి. గోడ నిర్మాణానికి అమెరికా పన్ను చెల్లింపుదారుల సొమ్మును విచ్చలవిడిగా వెచ్చించడం తగదని, ఎన్నికల ప్రచారంలో ఈ ఖర్చు మెక్సికోతోనే పెట్టిస్తానన్న ట్రంప్ వాగ్దానం ఏమయిందని సభలో డెమోక్రాట్లు ప్రశ్నించారు.
మూడోసారీ వీగిన ‘ట్రంప్‌కేర్’ బిల్లు
అమెరికా పౌరుల ఆరోగ్య బీమాకు సంబంధించిన ఒబామాకేర్ (అఫర్డబుల్ కేర్ యాక్ట్) చట్టాన్ని రద్దు చేసేందుకు ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు ఈ వారంలో మూడోసారి విఫలమయ్యాయి. ఎగువసభ సెనెట్‌లో పాలకపక్షమైన రిపబ్లికన్లకు స్పష్టమైన మెజారిటీ ఉన్నాగాని వారిలో ముగ్గురు ట్రంప్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయడంతో శుక్రవారం అది వీగిపోయింది.