అమెరికా, మెక్సికో మధ్య గోడ
దుర్భేద్యమైన సరిహద్దు నిర్మాణానికి ట్రంప్ ఆదేశం
► నిర్మాణ ఖర్చులు పంచుకోవాలని సూచన
► ఖండించిన మెక్సికో అధ్యక్షుడు.. డబ్బులిచ్చే ప్రసక్తే లేదని స్పష్టీకరణ
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను అమలుచేసే దిశగా దూసుకెళ్తున్నారు. అమెరికా దక్షిణాన ఉన్న మెక్సికో నుంచి అక్రమ వలసలను అడ్డుకునేందుకు ఆ దేశ సరిహద్దుల్లో దుర్భేద్యమైన గోడ నిర్మించేందుకు ఉద్దేశించిన రెండు ఆదేశాలపై గురువారం సంతకాలు చేశారు. గోడ నిర్మాణ ఖర్చులను మెక్సికో కూడా పంచుకోవాలని సూచించారు. దీన్ని మెక్సికో తీవ్రంగా ఖండించింది. ఎట్టిపరిస్థితుల్లోనూ గోడ నిర్మాణానికి సహకారం ఉండదని ఆ దేశాధ్యక్షుడు ఎన్రిక్ పెనా నీటో స్పష్టం చేశారు.
దీనిపై ట్విటర్లో ఘాటుగా స్పందించిన ట్రంప్.. ‘గోడ నిర్మాణ ఖర్చులు పంచుకోకపోతే జనవరి 31న జరపనున్న అమెరికా పర్యటనను రద్దుచేసుకోండి’ అని నీటోను ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్‌లో పేర్కొన్నారు. దీంతో అమెరికా–మెక్సికోల మధ్య వాతావరణం వేడెక్కింది. ట్రంప్ ట్వీట్ నేపథ్యంలో తన అమెరికా పర్యటనను రద్దుచేసుకుంటున్నట్లు నీటో ప్రకటించారు. అంతకుముందు గోడ నిర్మాణ ఆదేశాలపై సంతకం సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. ‘సరిహద్దుల్లేని దేశం దేశమే కాదు. ఈ రోజునుంచి అమెరికా తన సరిహద్దులపై పూర్తి నియంత్రణ సాధిస్తుంది’ అని వెల్లడించారు.
అమెరికా–మెక్సికోలు 3,100 కిలోమీటర్ల సరిహద్దులను పంచుకుంటున్నాయి. అయితే ఇందులో 1600 కిలోమీటర్లకు మాత్రమే గోడ నిర్మించనున్నారు. మిగిలిన చోట్ల కంచె, అక్కడక్కడ సిమెంటు స్లాబులతో కట్టిన సరిహద్దు ఉంది. ‘ఈ రెండు ఆదేశాలు మా ఇమిగ్రేషన్ సంస్కరణల్లో భాగమే’ అని అమెరికా అధ్యక్షుడు
వెల్లడించారు.
గోడకు మేం వ్యతిరేకం: మెక్సికో
ట్రంప్ నిర్ణయాన్ని మెక్సికో తీవ్రంగా ఖండించింది. ఈ గోడ నిర్మాణానికి తమవంతు సహకారం ఉండబోదని మెక్సికో అధ్యక్షుడు ఎన్రిక్ పెనా నీటో తెలిపారు. ఇరు దేశాల ప్రజలను ఒకటి చేయాల్సిందిపోయి.. విడగొట్టేందుకే ట్రంప్ ప్రయత్నిస్తున్నారన్నారు. అవతలి దేశం ప్రజలను గౌరవించటం కూడా అమెరికా నేర్చుకోవాలన్నారు. వలసవాదులకు, మెక్సికన్లకు భద్రత కల్పించాలని అధికారులను ఆదేశించిన నీటో.. అమెరికాలోని 50 మెక్సికన్ కాన్సులేట్‌లు యథావిధిగానే వలసవాదుల హక్కుల పరిరక్షణకు పనిచేస్తాయన్నారు.
ఉగ్ర విచారణలో టార్చర్ సబబే: ట్రంప్
ఉగ్రవాదం విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ అలసత్వం వహించదలచుకోలేదని ట్రంప్ స్పష్టం చేశారు. ఉగ్రవాదుల విచారణలో వాటర్‌బోర్డింగ్ (ముక్కు, నోటి కి గుడ్డకట్టి పైనుంచి నీటిని పోస్తూ ఊపిరాడకుండా చేసి నిజాలు చెప్పించే విధానం) వంటి కఠినమైన పద్ధతులను అవలంబించనున్నట్లు తెలిపారు. దేశభద్రతకోసం ఉగ్రవాదులను టార్చర్ చేయటం తప్పుకాదన్నారు. ‘వారు (ఐసిస్) కేవలం క్రిస్టియన్ అనే కారణంతో మనోళ్లను పట్టుకుని తలలు నరికేస్తుంటే.. ఎవరూ దీనిపై మా ట్లాడరు. నేను వాటర్‌బోర్డింగ్ అనగానే హక్కులు గుర్తొస్తాయా?’ అని ఏబీసీ న్యూ స్‌తో ట్రంప్ చెప్పారు. ట్రంప్ భద్రతలేని ఫోన్ నే వాడతుండటం దేశ భద్రతకు ము ప్పు అని ‘న్యూయార్క్ టైమ్స్’ పేర్కొంది.