ఇంటికొక కుక్క చాలు!
ప్రపంచంలో అంచనాలకు మించి పెరిగిపోతున్న జనాభాను నియంత్రించేందుకు కుటుంబ నియంత్రణ పద్ధతిని ప్రవేశపెట్టారనే విషయం మనకు తెలిసిందే. ‘ఒకరు ముద్దు.. ఇద్దరు హద్దు.. ముగ్గురు వద్దు’ అనే నినాదంతో ప్రజల్లో అవగాహన కూడా కల్పిస్తున్నారు. అయితే ఇటీవలే వన్‌చైల్డ్ పాలసీని ఎత్తివేసినా చైనా తాజాగా ఇప్పుడు ఒకే కుక్క చాలనే విధానాన్ని పాటించాలని ప్రజలకు ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల జంతు ప్రేమికుల సంఖ్య పెరిగిపోతుండడంతో శునకాల సంఖ్య కూడా హద్దులు మీరుతోందట. పైగా వీటికి సంబంధించిన అనారోగ్య సమస్యలను పరిష్కరించడం అధికారులకు తలనొప్పిగా మారుతోందట.
అంతేకాక తప్పిపోయిన కుక్కలను వెతికిపెట్టలేక పోలీసులూ తలలు పట్టుకుంటున్నారట. దీంతో ఇకపై ఒక కుటుంబం ఒకే కుక్కను పెంచుకోవాలనే కొత్త పాలసీని చైనా తీసుకొచ్చింది. చైనా దేశంలోని కింగ్‌డావో నగరంలో తొలిసారిగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. దీనివల్ల శునకాల సంఖ్య తగ్గడమే కాకుండా వాటి కోసం ప్రభుత్వం చేస్తున్న ఖర్చు గణనీయంగా తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.