
అతి క్రమశిక్షణతో అనర్థమే!
టోక్యో: పిల్లలని పెంచే క్రమంలో కొంత మంది పేరెంట్స్ మరీ అతి చేస్తుంటారు. క్రమశిక్షణ పేరుతో వారిని అనుక్షణం అదుపులో పెట్టడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ క్రమశిక్షణ పేరుతో తల్లిదండ్రులు చేసే పనులు పెద్దయ్యాక వారిపై తీవ్ర ప్రభావాలు చూపుతాయంటున్నారు పరిశోధకులు. పరిశోధనల్లో తేలిన విషయమేమిటంటే తల్లిదండ్రులు పిల్లలకు ఇచ్చే మద్దతుతోపాటు, సానుకూల దృక్పథంలాంటి అంశాలు పెద్దయ్యాక వారి విజయాలపై ప్రభావం చూపుతాయని తేలింది.
అంతేకాక అలాంటి పిల్లలు సంతోషంగా ఉంటారని కూడా రుజువైంది. మరోవైపు అధిక క్రమశిక్షణతో పెరిగే పిల్లలు చదువుల విషయంలో, వృత్తి పరంగా మంచి స్థానంలో ఉన్నపటికీ వారిలో ఒత్తిడి తీవ్రంగా ఉంటుందని, దీర్ఘకాలంలో పిల్లలపై దుష్ర్పభావాలకు క్రమశిక్షణ కారణమవుతుందని పరిశోధకులు చెబుతున్నారు. జపాన్లోని కోబో యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ నిశిముర కజ్వో ఆధ్వర్యంలో నిర్వహించిన ఆన్‌లైన్ సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.