భవన నిర్మాణాలపై ‘హైడ్రా’ ప్రభావం
గత ఆర్థిక సంవత్సరం ఫీజుల రూపేణా రూ.1695 కోట్లు
ఈసారి ఇప్పటి వరకు సగం కూడా రాని వైనం..
వాస్తవంగా రియల్టర్ల జోలికి వెళ్లని హైడ్రా
అనవసర అపోహల వల్లే నిర్మాణాల్లో మందగమనం అని అంచనా..
సాక్షి,హైదరాబాద్: హైడ్రా భయం భవన నిర్మాణాలపై ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీకి గతంలో వచ్చిన ఆదాయం ఈ సంవత్సరం రాలేదు. చెరువులు, సరస్సులు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం ఈ సంవత్సరం ఏర్పాటు చేసిన హైడ్రా ఎందుకనోగానీ ప్రజల్లో..ముఖ్యంగా రియల్టర్లలో వణుకు పుట్టిస్తోంది. వాస్తవానికి హైడ్రా రియల్టర్ల జోలికి వెళ్లడం లేదు. ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదుల మేరకు చెరువులను కబ్జాలు చేసి నిరి్మస్తున్న భవనాలనే కూల్చివేస్తోంది. కానీ అనవసర భయాలతో రియల్టర్లు కొత్త ప్రాజెక్టులకు వెనుకడుగు వేస్తున్నట్లు కనిపిస్తోంది. జీహెచ్‌ఎంసీకి గత సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం భవన నిర్మాణ ఫీజుల ద్వారా రావాల్సిన ఆదాయం గణనీయంగా తగ్గడం ఇందుకు ఉదాహరణ. పెద్దపెద్ద నిర్మాణాలు జరిగితేనే ఫీజుల రూపేణా అధిక ఆదాయం వస్తుంది.
పెద్ద నిర్మాణాలు స్తంభించడంతో ఆదాయం తగ్గినట్లు తెలుస్తోంది. గడచిన ఆరి్థక సంవత్సరం (2023–24)లో జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్ విభాగం ద్వారా రూ.1695 కోట్ల ఆదాయం జీహెచ్‌ఎంసీ ఖజానాకు చేరింది. ఈ ఆర్థిక సంవత్సరం (2024–25) అక్టోబర్ నెలాఖరు వరకు వచి్చంది రూ.459 కోట్లు మాత్రమే. నవంబర్, డిసెంబర్‌లలోనూ పెద్ద నిర్మాణాల అనుమతులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. 2023–24 తోపోలిస్తే ఇంకా సగం ఆదాయం కూడా రాలేదు. ప్రస్తుత ఆరి్థక సంవత్సరం ముగిసేందుకు మిగిలిన మూడునెలల్లో ఏమేర ఆదాయం వస్తుందో చెప్పలేని పరిస్థితి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రూ.1000 కోట్లు సమకూరడం కూడా కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
లేనిపోని భయాలు
కొత్త నిర్మాణాలకు రియల్టర్లు వెనుకడుగు వేస్తుండటంతో మెజార్టీ రియల్టర్లు ఇంతకాలం చెరువులు, సరస్సులను కబ్జాచేసే నిర్మాణాలు చేశారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇప్పటికే భారీ నిర్మాణాలు జరిగినందున ఖాళీ స్థలాలంటూ లేనందున కొత్తగా నిర్మాణాలు జరగడం లేవని టౌన్‌ప్లానింగ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే సాచురేషన్ స్థాయి మించిపోయిందని అంటున్నాయి. పాతభవనాలను కూల్చి అధునాతనంగా నిరి్మంచే వారుంటే తప్ప పెద్ద నిర్మాణాలు వచ్చే అవకాశాల్లేవని కూడా చెబుతున్నాయి.
కూల్చివేతలకే కాదు..
హైడ్రా అనగానే ప్రజలకు కూల్చివేతలే గుర్తుకొస్తుండటం దారుణం. మూసీ పునరుజ్జీవనానికి సంబంధించి ఆస్తులు కూల్చివేసింది రెవెన్యూ విభాగం అయినప్పటికీ, హైడ్రా కూల్చివేసిందనే ప్రచారంతో అదే ముద్ర పడింది. హైడ్రా ఉన్నది కేవలం కూల్చివేతలకే కాదు..దానికున్న విధుల్లో అదొక భాగం మాత్రమే. అన్ని రకాల ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, విపత్తు నిర్వహణలు కూడా ఉన్నాయి. ట్రాఫిక్ చిక్కుల పరిష్కారానికీ పనిచేస్తుంది. వీటి గురించి సామాన్య ప్రజలకు తగిన అవగాహన లేకపోవడం హైడ్రా నిందల పాలయ్యేందుకు కారణమైంది. ఈ అంశంలో ప్రజలకు పూర్తిస్థాయి అవగాహన కల్పించాల్సిన అవసరముందని పట్టణ ప్రణాళిక నిపుణులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment