
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ అబద్దాల పుట్ట అంటూ సీరియస్ వార్నింగ్‌లతో చెలరేగిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు పాక్ గట్టి కౌంటర్ ఇచ్చింది. పాకిస్తాన్ చేసిన త్యాగాలను ట్రంప్ విస్మరించారని పాక్ మంత్రి అసన్ ఇక్బాల్ ఆరోపించారు. నూతన సంవత్సరం తొలిరోజున తన ట్వీట్ ద్వారా ట్రంప్ పాక్ ప్రతిష్టపై దాడి చేశారని అన్నారు. అమెరికా రాజకీయాల ఫలితంగానే ఈ ప్రాంతంలో ఉగ్రవాదం ప్రబలిందని ఇక్బాల్ దీటుగా బదులిచ్చారు.
పాక్‌ను అబద్దాల పుట్టగా పిలిచే హక్కు ఏ ఒక్కరికీ లేదని, ఉగ్రవాద వ్యతిరేక యుద్ధంలో తాము ఎన్నో త్యాగాలు చేశామని ఆయన చెప్పుకొచ్చారు. 1970-80 ప్రాంతాల్లో అమెరికా విధానాల కారణంగా ఆప్ఘనిస్తాన్‌లో ఉగ్రవాదం వేళ్లూనుకుందని అన్నారు. సోవియట్స్‌తో యుద్ధం ముగిసిన వెంటనే మీరు (అమెరికా) ఆప్ఘన్‌లో నాటిన సోవియట్ వ్యతిరేకఉద్యమం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనే అంశాన్ని విస్మరించారని..సోవియట్‌తో గెలుపు కోసం మీరు నాటిన ఉగ్ర ధోరణులు వెంటనే కంప్యూటర్ చిప్స్‌ను తయారుచేయలేవని చురకలు అంటించారు.
అమెరికా విధానాల ఫలితంగానే ఉగ్రవాదం వేళ్లూనుకున్న వైనాన్ని గుర్తుచేశారు. ఆప్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్‌కు వచ్చిన లక్షలాది శరణార్థుల కోసం అమెరికా చేస్తున్నదేమీలేదని మంత్రి ఆరోపించారు.