భగత్‌సింగ్‌పై హత్యకేసు విచారణ వేగవంతం!
లహోర్: భారత స్వాతంత్ర్య సమరయోధుడు భగత్‌సింగ్‌పై నమోదైన హత్యకేసు విచారణను వేగవంతంలో చేయాలని కోరుతూ పాకిస్థాన్ కోర్టులో సోమవారం పిటిషన్ దాఖలైంది. భగత్‌సింగ్ ఉరికంభం ఎక్కకముందు 83 ఏళ్ల కిందట బ్రిటిష్ అధికారులు ఈ హత్యకేసును నమోదుచేశారు. బ్రిటిష్ పోలీసు అధికారి జాన్ పీ సాండర్స్‌ను హత్య చేశాడంటూ భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురులపై అభియోగాలు మోపారు. ఈ కేసులో ఆ ముగ్గురిని నిర్దోషులుగా ప్రకటించాలని కోరుతూ భగత్‌సింగ్ మెమోరియల్ ఫౌండేషన్ చైర్మన్, అడ్వకేట్ ఇంతియాజ్ రషీద్ ఖురేషి గతంలో లాహోర్ హైకోర్టు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ కేసు విచారణ వేగవంతం చేయాలని, ఇందుకు ధర్మాసనం వాదనలు వినాలని కోరుతూ ఆయన సోమవారం లాహోర్ హైకోర్టులో మరో పిటిషన్ వేశారు. అవిభాజ్య భారత్ స్వాతంత్ర్యం కోసం భగత్‌సింగ్ వీరోచితంగా పోరాడారని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. సామ్రాజ్యవాద బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రపన్నారనే ఆరోపణలపై 1931 మార్చ్ 23న భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురులను ఉరితీశారు.
అయితే వారిపై నమోదు చేసిన కేసుల నకిలీవని, బూటకపు కేసులో ఇరికించి.. వారికి మొదట జీవితఖైదు విధించి.. ఆ తర్వాత ఉరిశిక్షగా దానిని మార్చి అమలుచేశారని ఖురేషి పేర్కొన్నారు. భారత ఉపఖండంలో సిక్కులే కాకుండా ముస్లింలు సైతం భగత్‌సింగ్‌ను గౌరవిస్తారని, పాకిస్థాన్ స్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నా ఆయనకు రెండుసార్లు నివాళులర్పించడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు.