
పాకిస్తాన్ సుప్రీం కోర్టు, పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ (ఫైల్)
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ మాజీ సైనిక పాలన అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు పాక్ సుప్రీం కోర్టు ఝలకిచ్చింది. పాకిస్తాన్‌కు రావాలంటే తనకు భారీ భద్రత కల్పించాలన్న ముషారఫ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. సొంత దేశానికి రావాడానికి సైనికుడు ఎందుకు భయపడతాడు అంటూ ముషారఫ్‌ను ఉద్దేశించి సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ముషారఫ్ దుబాయ్‌లో ఉంటున్నారు. గతంలో పాకిస్తాన్ సైన్యంతో తిరుగుబాటు చేయించి, ముషారఫ్ అధ్యక్ష పదవిని చేపట్టారు. 1998 నుంచి 2008 వరకు పాకిస్తాన్‌ను పరిపాలించారు. అయితే 2013లో ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయకుండా పెషావర్ కోర్టు ముషారఫ్‌పై నిషేధం విధించింది.
కాగా, వచ్చే నెల 25న పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అందులో పోటీ చేసేందుకు అనుమతినిస్తూ.. తనపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని ఆయన పాక్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే విచారణ నిమిత్తం కోర్టుకు హాజరు కావాలని ముషారఫ్‌ను సుప్రీం ఆదేశించింది. పాకిస్తాన్‌కు వస్తే తనకు భారీ భద్రత ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. భద్రత విషయమై ఆయనకు ఎలాంటి సమాధానం అందలేదు. బుధవారం సుప్రీం కోర్టు చేపట్టిన విచారణకు ముషారఫ్ హాజరు కాలేదు. దాంతో సుప్రీం కోర్టు ఆయనకు ఒక రోజు గడువు ఇస్తూ.. గురువారం 2 గంటలకు కోర్టులో హాజరు కావాల్సిందేనని అల్టిమేటమ్ జారీ చేసింది.