
ఇమ్రాన్ ఖాన్ ఫైల్ ఫోటో
ఇస్లామాబాద్ : క్రికెట్‌లో ఆయనో ఓ సంచలనం... క్రికెటర్‌గా ఆయన పేరు తెలియని వారుండరు. 1992 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ జట్టును విజయ పథంలో నడిపించిన సారథి ఆయన. ఆయనే ఇమ్రాన్ ఖాన్. ప్రస్తుతం ఇప్పుడు.. ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ దశాదిశను నిర్దేశించబోతున్నారు. తీవ్రమైన ఆరోపణలు, వాగ్వాదాలు, భారీ హామీలతో ఎంతో రసవత్తరంగా సాగిన దాయాది దేశ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ సంచలన సృష్టించారు. హోరాహోరీగా సాగిన.. ఎంతో ఉత్కంఠ రేపిన ఫలితాల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్(పీటీఐ) ఆధిక్య స్థానాల్లో విజయ భావుటా ఎగురవేసింది. 120 స్థానాలను కైవసం చేసుకుని, మెజార్టీకి కాస్త దూరంలో ఉంది. పీటీఐతో నువ్వానేనా అంటూ తలపడిన పీఎంఎల్-ఎన్ పార్టీకి 61 సీట్లు దక్కాయి. ఇక పీపీపీ 40 స్థానాలను, ఇతరులు 51 స్థానాలను దక్కించుకున్నారు. పాకిస్తాన్ పార్లమెంటులో మొత్తం 272 స్థానాలున్నాయి. అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మెజార్టీ 137 సీట్లు ఉండాలి.
ఇండిపెండెంట్లు, ఇతర చిన్న పార్టీల సాయంతో ఇమ్రాన్ ప్రధాని పీఠాన్ని అధిరోహరించబోతున్నట్టు వెల్లడవుతోంది. 22 ఏళ్ల పోరాటం అనంతరం, తనకు ఈ అవకాశం దక్కిందని, పేదల బాధలు తీర్చడమే తన ప్రధాన ఎజెండా అని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఫలితాల ప్రకటన నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. పాకిస్తాన్ ఏర్పాటుకు మూలకారణమైన జిన్నా ఆశయాలను నెరవేర్చేందుకు తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. ఈ ఎన్నికల కోసం ప్రజలు ఎన్నో త్యాగాలు చేశారని, పాకిస్తాన్‌లో ప్రజాస్వామ్యం బలపడుతుందనడానికి ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శమని అన్నారు. ఈ ఎన్నికలను చరిత్రాత్మకమైనవిగా ఇమ్రాన్ అభివర్ణించారు. పన్ను రూపాన్ని మార్చేస్తానని... చైనాతో బంధాలను మరింత పెంచుకుంటానని తెలిపారు. ఆఫ్గనిస్తాన్‌లో శాంతి కోసం తాను తోడ్పతానన్నారు. భారత మీడియా తనను బాలీవుడ్ విల్లన్‌గా చిత్రీకరించిందని ఇమ్రాన్ ఆరోపించారు. భారత్‌తో సత్సంబంధాలు కొనసాగించాలని కోరుకునే వాళ్లలో తాను ఒకడినని, ఒకవేళ భారత్ ఒక్క అడుగు ముందుకేస్తే, పాకిస్తాన్ రెండు అడుగులు ముందుకేస్తుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment